హీరో సిద్దార్థ్ నటించిన తాజా మూవీ గృహం తన నిర్మాణ సంస్థలో తెరకెక్కించిన ఈ మూవీ తమిళ.. హిందీ.. తెలుగు భాషల్లోనూ మంచి టాక్ తెచ్చుకుంది. వసూళ్లు కూడా బాగున్నాయి. ఈ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లో ఏమో సిద్దార్థ్ మాటల్లో దూకుడు బాగా పెరిగినట్లుంది. గతంలో తెలుగు సినిమాల్ని తక్కువ చేసి మాట్లాడానంటూ తన మీద విమర్శలు చేస్తున్న టాలీవుడ్ జనాల్ని సిద్ధు గట్టిగా తగులుకున్నాడు.
తాను తెలుగులో మాట్లాడతానని.. తెలుగులో 15 సినిమాలు చేశానని.. తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యానని.. తనకు తెలుగు సినిమాల గురించి మాట్లాడే హక్కు లేదని ఎవరూ అనలేరని సిద్ధు అన్నాడు. అలా ఎవరైనా అంటే చెప్పుతో కొడతా అంటూ సిద్ధు స్టేట్మెంట్ ఇవ్వగం గమనార్హం. తెలుగు ప్రేక్షకులు కొత్తగా సినిమాలు చేస్తే ఆదరించరంటూ గతంలో చేసిన కామెంట్ గురించి ప్రస్తావిస్తే.. తాను అలా అనలేదని.. ఇక్కడ రియాలిటీకి దగ్గరగా సినిమాలు చేయనని మాత్రమే అన్నానని సిద్ధు చెప్పాడు.
తాను ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేస్తున్నానో చూడాలని.. అది తెలుసుకుని మాట్లాడేవాళ్లకు తాను సమాధానం ఇస్తాను తప్ప మసాలా గాళ్లకు కాదని సిద్ధు అన్నాడు. తెలుగు ప్రేక్షకులతో తన బంధం విడదీయరానిదని సిద్ధు అన్నాడు. ‘గృహం’ రిలీజ్ ముంగిట ప్రెస్ నోట్లో సిద్ధు మాట్లాడుతూ.. చెత్త సినిమాలు తీస్తే తనను చెప్పుతో కొట్టాలని అనడం తెలిసిందే. అలా అన్న మూడు రోజులకే ఇప్పుడు ‘చెప్పుతో కొడతా’ అనే కామెంట్ చేసి షాకిచ్చాడు సిద్ధు.