కర్ణాటక సీఎం సిద్దూ..అరుదైన రికార్డు!

3
- Advertisement -

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా ఆయన రికార్డు నెలకొల్పారు. సామాజిక న్యాయం, భూ సంస్కరణలతో గుర్తింపు పొందిన మాజీ సీఎం దేవరాజ్ ఉర్స్ పేరిట ఉన్న రికార్డును సిద్దరామయ్య అధిగమించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సిద్దరామయ్యకు అభినందనలు తెలియజేస్తూ గుడ్ లక్ అని శుభాకాంక్షలు తెలిపారు.

రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న 77 ఏళ్ల సిద్దరామయ్య జనవరి 6న ఉర్స్ 2,792 రోజుల పాలన రికార్డును సమం చేశారు. దేవరాజ్ ఉర్స్ మొదటి పదవీకాలంలో (1972 మార్చి 20 నుంచి 1977 డిసెంబర్ 31 వరకు) 2,113 రోజులు, రెండో పదవీకాలంలో (1978 ఫిబ్రవరి 28 నుంచి 1980 జనవరి 7 వరకు) 679 రోజులు ముఖ్యమంత్రిగా సేవలందించారు.

దేవరాజ్ ఉర్స్ తర్వాత పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి సిద్దరామయ్యే. తొలి పదవీకాలంలో (2013 మే 13 నుంచి 2018 మే 15 వరకు) ఆయన 1,829 రోజులు సీఎంగా ఉన్నారు. 2023 మే 20న మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 963 రోజులు పూర్తి చేయడంతో మొత్తం పదవీకాలం రికార్డు స్థాయికి చేరింది.

ఈ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ, తాను రికార్డులు బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల ఆశీస్సుల వల్లే ఈ అవకాశం వచ్చిందని చెప్పారు. రికార్డు బద్దలు కొట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ఇది యాదృచ్ఛికం. దేవరాజ్ ఉర్స్ ఎంతకాలం సీఎంగా ఉన్నారో కూడా నాకు తెలియదు. ప్రజల ఆశీస్సులతో ఆయన రికార్డును సమం చేయగలిగాను, రేపు అది బ్రేక్ అవుతుంది అని మైసూరులో వ్యాఖ్యానించారు.

Also Read:భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కాదు!

- Advertisement -