ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో, బందోబస్తు కోసం వచ్చిన ఓ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 174 వద్ద చోటుచేసుకుంది. కొమురంభీం జిల్లా పెంచికల్‌పేటకు చెందిన ఎస్సై శ్రీధర్ ప్రధాని బందోబస్తు నిమిత్తం విధులు నిర్వర్తించేందుకు నగరానికి వచ్చాడు. శ్రీధర్ 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐ.
బందోబస్తులో భాగంగా రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలో గల 20 అంతస్తుల భవనంలోని 19వ అంతస్తులో నిలబడి గస్తీ నిర్వహిస్తున్నాడు. ఈ రోజు ఉదయం 9:30గంటల సమయంలో విధుల్లో ఉండగానే తన రివాల్వర్‌తో చాతి భాగంలో కాల్చుకున్నాడు. శ్రీధర్ ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ… ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. రివాల్వర్ శబ్దం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహరం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీధర్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం. మోడీ రెండు రోజుల పర్యటనలో బాగంగా జిల్లా నుండి నలుగురు ఎస్‌ఐలను బందోబస్తుకు రప్పించారు. వీరిలో శ్రీధర్ కూడా ఉన్నాడు.