రాత్రి భోజనం చేసిన వెంటనే సోఫాలో కూర్చోవడం లేదా పడుకోవడం చాలామందికి అలవాటు. అయితే భోజనం అనంతరం కేవలం 10 నిమిషాలు నడవడం జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన సప్లిమెంట్లు, డిటాక్స్ డ్రింక్స్ లేదా క్లిష్టమైన ఆరోగ్య చిట్కాల కంటే ఈ చిన్న అలవాటు శరీరానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు.
భోజనం తర్వాత నడవడం వల్ల కడుపు, పేగుల కండరాలు చురుకుగా పనిచేస్తాయి. దీంతో ఆహారం జీర్ణవ్యవస్థలో వేగంగా ముందుకు కదులుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ (అసిడిటీ), మలబద్ధకం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. భారీ భోజనం చేసిన తర్వాత కడుపులో భారంగా అనిపించే వారికి ఈ అలవాటు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరగడం సహజం. అయితే కేవలం 10 నిమిషాల నడక వల్ల ఈ పెరుగుదలను గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. నడిచే సమయంలో కండరాలు శక్తి కోసం గ్లూకోజ్‌ను వినియోగిస్తాయి. దీంతో శరీరం చక్కెరను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఇది మధుమేహం ఉన్నవారికే కాకుండా, భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి కూడా ఉపయోగపడుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడేందుకు చాలామంది డిటాక్స్ జ్యూసులు, సప్లిమెంట్లు, ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలపై డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే భోజనం తర్వాత నడకకు ఎలాంటి ఖర్చు ఉండదని, ప్రత్యేక పరికరాలు లేదా శిక్షణ అవసరం లేదని డాక్టర్ సేథి గుర్తు చేశారు. ఈ చిన్న అలవాటును ప్రతిరోజూ పాటిస్తే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటంతో పాటు, శరీర జీవక్రియ (మెటబాలిజం) కూడా ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
Also Read:FIFA:ఫైనల్‌కు అర్జెంటీనా
భోజనం తర్వాత కొద్దిసేపు చురుకుగా ఉండే వారిలో జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందని, ఎక్కువసేపు కూర్చునే వారితో పోలిస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆరోగ్యానికి క్లిష్టమైన మార్గాల కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఈరోజు నుంచే రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం ప్రారంభించండి. మీ జీర్ణవ్యవస్థకు చేయగలిగే అత్యుత్తమ అలవాట్లలో ఇదొకటి.

