కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ శివరాజ్ పాటిల్ (85) కన్నుమూశారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఉన్న తన స్వగృహంలో బుధవారం ఉదయం 6.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తీవ్రతరమవడంతో చికిత్స పొందుతున్నప్పటికీ, పరిస్థితి విషమించి మరణించారు.
శివరాజ్ పాటిల్ రాజకీయ జీవితం దాదాపు అయిదు దశాబ్దాలు కొనసాగింది. 1972లో రాజకీయాల్లో అడుగుపెట్టి, ఇద్దుసార్లు ఎమ్మెల్యేగా, ఏడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ప్రజల నమ్మకం పొందారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఎదిగిన ఆయన కేంద్ర హోంమంత్రిగా, స్పీకర్‌గా, పంజాబ్ గవర్నర్‌గా కూడా సేవలందించారు. క్రమశిక్షణ, నిష్ఠ, శాంత స్వభావం ఆయన రాజకీయ యాత్రను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
శివరాజ్ పాటిల్ మరణవార్త రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన మరణం దేశానికీ, కాంగ్రెస్ పార్టీకీ తీరని లోటు అని పేర్కొన్నారు. పార్టీకి అంకితభావంతో పనిచేసిన, ప్రజాసేవకు ఆదర్శంగా నిలిచిన నేత అని రేవంత్ భావోద్వేగంతో గుర్తుచేశారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు తెలిపారు.
Also Read:మంత్రి కొండాపై నాన్ బెయిలబుల్ వారెంట్

