భారత్ జట్టుకి టీ20 కెప్టెన్‌గా ఎంపికైన కొద్దినెలలకే టీ20 ప్రపంచకప్.. నాలుగేళ్లలో కోట్లాది మంది అభిమానులు 28 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్.. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా ఐసీసీ మూడు టోర్నీల్లోనూ జట్టును విజేతగా నిలిపిన ఏకైక భారత్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.
అయితే.. ఏ టోర్నీలో భారత్ విజేతగా నిలిచినా ఆటగాళ్లు అందరూ ట్రోఫీతో ముందు వరుసలో ఫొటోలకి ఫోజిలిస్తుంటే ధోనీ మాత్రం వెనక వరుసలో ఒక మూలన ఉండిపోతాడు. అది కెప్టెన్సీ హోదా ఉన్నా లేకపోయినా.. ధోనీ స్థానం అదేనట.
ఇక టీమిండియా బస్సులో ప్రయాణించే సమయంలో కూడా ధోనికి ఆఖరి వరుస సీట్ అంటే చాలా ఇష్టమట. అంతర్జాతీయ కెరీర్ ను ఆరంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ ధోని చివరి సీట్లోనే ప్రయాణిస్తున్నాడట. కెరీర్ ను ఆరంభించిన కొత్తలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరుల్ని గౌరవించే క్రమంలో ధోని ఆఖరి సీట్లో కూర్చొనేవాడట.
దీన్ని అప్పట్నుంచి అలవాటుగా మార్చుకున్న ధోని ఆ ప్లేస్ ను ఇష్టమైనదిగా మార్చేసుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్ తో మూడో వన్డే తరువాత కూడా ఆటగాళ్లు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో శిఖర్ ధావన్ సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక్కడ ధోని చివరి వరుసలో కనిపించడంతో అది చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టి వికెట్ల వెనుక కూల్ గా వ్యూహాలు రచించేధోని.. బస్సులో కూడా వెనుకాలే కూర్చొని ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడనే విషయం అర్దమవుతోంది.