కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ శుక్రవారం జరిగే కీలక పార్టీ సమావేశానికి హాజరు కావడం లేదని స్పష్టమైంది. అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు, యూడీఎఫ్ అవకాశాలపై చర్చించేందుకు పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత సహా రాష్ట్రంలోని సీనియర్ నాయకులందరూ ఈ భేటీలో పాల్గొననున్నారు.
అయితే, ఇటీవల ఎర్నాకులంలో నిర్వహించిన ‘మహాపంచాయత్’ కార్యక్రమంలో తనను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, రాహుల్ గాంధీ అవమానించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో థరూర్ ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత రాష్ట్ర నేతలు, అధిష్టానం ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ, థరూర్ స్పందించలేదని తెలుస్తోంది. బదులుగా శనివారం కోజికోడ్‌లో జరిగే కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరవుతానని ఆయన తెలియజేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
థరూర్‌కు సన్నిహితంగా ఉన్న నేతలు మాట్లాడుతూ, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు పూర్తిగా అనవసరమని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని, పార్టీతో సన్నిహితంగా పనిచేస్తున్నానని థరూర్ ఇప్పటికే నాయకత్వానికి స్పష్టం చేశారని వారు తెలిపారు.
Also Read:రిపబ్లిక్ డే ..భద్రత కట్టుదిట్టం!
ఇప్పుడు నిర్ణయం మొత్తం అధిష్టానం చేతుల్లోనే ఉంది అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. తిరువనంతపురంలో యువత, టెక్ నిపుణులు, మధ్యతరగతి వర్గాల్లో థరూర్‌కు బలమైన మద్దతు ఉంది. ఆ వోటు బ్యాంకుపై బీజేపీ కూడా దృష్టి పెట్టింది. జిల్లాలో 14 స్థానాల్లో యూడీఎఫ్‌కు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న పరిస్థితిలో ఇది కాంగ్రెస్‌కు పెద్ద సవాలుగా మారవచ్చు అని ఆయన అన్నారు.

