భారత క్రికెటర్ సంజూ శాంసన్‌పై ప్రశంసలు గుప్పించారు శశి థరూర్. సంజు శాంసన్‌ను మొదటిసారి కలిసింది అతను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు. త్రివేండ్రంలో ఒక క్లబ్ తరఫున ఆడుతూ నెట్స్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి అతని కెరీర్‌ను గమనిస్తూ వస్తున్నాను. హైస్కూల్‌లో ఉన్నప్పుడే అతనిని, అతని తండ్రిని కలిశాను. ఆరంభం నుంచి ఇప్పటివరకు అతని ప్రయాణాన్ని చూసిన నేను అతనికి పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చాడు.
కేరళకు చెందినవాడిగా గర్వంగా ఉండటమే కాకుండా, నేను త్రివేండ్రం ఎంపీ కావడంతో అతను నా నియోజకవర్గానికి చెందినవాడు కావడం మరింత గర్వంగా అనిపిస్తుంది అన్నారు. అండర్-19 రోజుల నుంచే భారత్ తరఫున ఆడే స్థాయికి ఎదిగాడు. కేరళ కోసం మూడు ఫార్మాట్లలోనూ రాణించాడు. అయితే అతనికి దక్కాల్సిన అదృష్టం మాత్రం దక్కలేదు. ఒక వన్డేలో సెంచరీ కొట్టి, తర్వాతి మ్యాచ్‌కు అవకాశం లేకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నారు శశి.
సంజూకు కాలం తనను నిరూపించుకునే అవకాశం రాలేదనే భావన నాకు ఎప్పుడూ ఉంది. అయితే ఇటీవల అతను ఆడిన 97* ఇన్నింగ్స్ అసాధారణం. ఒక్క క్షణం కూడా సందేహం, ఆవేశం, ప్రమాదకర షాట్లు కనిపించలేదు. అతని బ్యాటింగ్‌లో ఒక అసాధారణ ప్రశాంతత కనిపించింది అన్నారు.
Also Read:దేవరకొండ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
గతంలో అతన్ని ఆర్డర్‌లో పైకీ, కిందకీ మార్చడం, కొన్ని వైఫల్యాల ఆధారంగా విమర్శించడం వంటివి అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. కానీ ఆ రోజు మాత్రం పూర్తిగా స్థిరత్వంతో ఆడాడు. ఒక్కో బంతిని చక్కగా వినియోగించుకున్నాడు. బౌండరీ రాకపోతే సింగిల్ తీసుకున్నాడు. కేవలం ఎనిమిది డాట్ బాల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ఇన్నింగ్స్ నాకు 1987లో బెంగళూరులో తన చివరి టెస్ట్‌లో సునీల్ గవాస్కర్ చేసిన 96 పరుగులను గుర్తు చేసింది అని ప్రశంసలు గుప్పించారు.

