బాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముంబై తీరంలో కార్డీలియా క్రూయిజ్ లైనర్ అనే నౌకపై శనివారం రాత్రి ఎన్సీబీ అధికారులు దాడులుచేశారు. ఈ దాడిలో పలువురు యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కార్డిలియా క్రూయజెస్‌లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎన్‌సీబీ అధికారులు అకస్మాత్తుగా దాడిచేసి తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో కొకైన్, ఎండీని స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో చిందులేస్తున్న దాదాపు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.క్రూయిజ్‌లో డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్సీబీ అదుపులో ఉన్న వారిలో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచా, నుపుర్ సారికా, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రా ఉన్నారు.
శనివారం రాత్రి అత్యంత విలాసవంతమైన కార్డీలియా క్రూయిజ్ లైనర్ ముంబై నుంచి గోవాకు బయలుదేరింది. రెండు వారాల కిందటే ఈ క్రూయిజ్ లైనర్ సర్వీసులు ప్రారంభమవగా.. శనివారం పార్టీ కోసం ఏకంగా క్రూయిజ్‌నే అద్దెకు తీసుకున్నారు. నమస్క్రే ఎక్స్‌పీరియెన్స్, ఫ్యాషన్ టీవీ సంయుక్తగా క్రూయిజ్ షిప్‌లో మూడు రోజుల పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అక్టోబరు 2 నుంచి 4వ తేదీ వరకు పార్టీ జరగాల్సి ఉంది. కానీ అంతలోనే ఎన్సీబీ దాడులు చేసింది.