పాకిస్తాన్ క్రికెట్‌లో మరోసారి మైదానం బయట వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చేత 61 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత, మాజీ క్రికెటర్లు జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా షాహిద్ అఫ్రిది, మహ్మద్ యూసుఫ్, షోయబ్ అక్తర్ లాంటి మాజీ ఆటగాళ్లు సీనియర్ల స్థానంలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని సూచించారు.
ఈ వ్యాఖ్యలపై ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ స్పందిస్తూ, “మాజీ ఆటగాళ్లు కూడా వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించలేకపోయారు” అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
దీనిపై అఫ్రిది స్పందిస్తూ…విమర్శలకు సమాధానం మాటలతో కాకుండా ప్రదర్శనతో ఇవ్వాలని సూచించాడు. మా కాలంలో కూడా మాకు చాలా విమర్శలు వచ్చాయి. మేము చిన్న జట్లపై కాదు, పెద్ద జట్లపై ప్రదర్శనతో సమాధానం ఇచ్చాం” అని ఆయన అన్నారు. నమీబియాపై బాగా ఆడిన షాదాబ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లపై కూడా అదే స్థాయిలో రాణించాలని అఫ్రిది సూచించాడు.
ఇదిలా ఉండగా, నమీబియాపై విజయం సాధించిన పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ ఎయిట్స్‌కు అర్హత సాధించింది. గ్రూప్ బీలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో కలిసి పోటీపడనుంది. గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి.
Also Read:AIతో కొత్త ఉద్యోగాల సృష్టి!

