సినిమాల కోసం ఎంతైనా శ్రమిస్తాడు షారుక్‌ఖాన్. ఆ కష్టపడేతత్వమే అతన్ని బాలీవుడ్ బాద్‌షాగా మార్చింది. బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగే క్రమంలో ఎన్నో జయాపజయాలను ఎదుర్కొన్నాడు. కాకపోతే అతని కెరీర్‌లో ఓ చిత్రం మాత్రం తెగ బాధపెట్టిందట. షారుక్ ద్విపాత్రాభినయంలో ఈ ఏడాది ‘ఫ్యాన్’ చిత్రం వచ్చింది. ఈ సినిమా కోసం షారుక్ ఎంతగానో శ్రమించాడు. అందులో ఫ్యాన్ పాత్ర కోసం ఇరవై ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు రోజుకు 6 గంటలపాటు మేకప్‌కే వెచ్చించాడు. కానీ ఇంతకష్టపడి తీసిన ఆ చిత్రం పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. దాని గురించి మాట్లాడిన షారుక్.. ‘‘ సినిమాలు విజయం సాధించనపుడు కచ్చితంగా బాధేస్తుంది. అందరికీ ఇలాంటి ఫ్లాప్‌లు ఎదురవుతుంటాయి. కాకపోతే ‘ఫ్యాన్’ సినిమా మాత్రంనాకు ప్రత్యేకం. ఈ సినిమా విడుదల తర్వాత దాని ఫెయిల్యూర్‌పై ఎన్నో చర్చలు జరిగాయి. కాకపోతే ఆ చర్చలు నన్ను ఎమోషనల్‌గా ఎంతో బాధించాయి.’’ అని చెప్పాడు కింగ్‌ఖాన్.
ఈ ‘ఫ్యాన్’ చిత్రం ఫ్లాప్ కావడంతో భవిష్యత్‌లో ప్రయోగాత్మక చిత్రాలు తీయడానికి ఏమైనా భయపడుతున్నారా? అని అడగ్గా.. ‘నేను మొండిని. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే ఎప్పటిలాగే చేస్తా. ఎంతమంది నన్ను ఇలాంటి సినిమాలు వద్దని చెప్పినా నాకు నచ్చినట్టుగానే.. మళ్లీ మళ్లీ ఇలాంటి సినిమాల్లో నటిస్తా’ అని చెప్పుకొచ్చాడు షారుక్. ప్రస్తుతం షారుక్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు డియర్ జిందగీ సినిమాను కంప్లీట్ చేస్తూనే,,మరోవైపు రాయిస్ సినిమాపై ఫినీష్ చేసే పనిలో ఉన్నాడు. ఇక ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ది రింగ్ అనే ఓ సినిమా చేయబోతున్నాడు.