ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన సంవత్సరం 2016. కాలగమనంలో సంవత్సరాల వస్తూ,పోతూ ఉంటాయి. అయితే భారత క్రీడా చరిత్రలో ప్రత్యేకంగా గుర్తుండి పోయే సంవత్సరాలలో ఒకటిగా 2016 మిగిలిపోతుంది. క్రీడారంగంలో 2016 భారత్‌కు ప్రత్యేకమైందిగా నిలిచింది. చిరస్మరణీయమైన విజయాలను సొంతం చేసుకున్న భారత ఆటగాళ్లు…చరిత్రలో మైలురాయిగా నిలిచారు.
విశ్వక్రీడా రియో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాదీ స్టార్ పీవీ సింధు సిల్వర్ మెడల్ సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. సింధు, సాక్షిలు రియో మెడల్స్‌తో మెరువగా.. ప్రపంచ మేటీ జిమ్నాస్ట్‌లకు సైతం సాధ్యం కానీ, సాహాసం చేయలేని ప్రమాదకర ప్రోడునోవా విన్యాసంతో క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొట్టింది దీపా కర్మాకర్. కళ్లుచెదిరే విన్యాసాలతో మెడల్‌కు చేరువైనట్టే కనిపించిన ఈ త్రిపుర జిమ్నాస్ట్.. అనూహ్యంగా నాల్గో స్థానంతో సరిపెట్టుకున్నది.
వీరితో పాటు అదితి అశోక్ అద్బుత ప్రతిభ కనబర్చి ఈ ఏడాది మేటిగా నిరూపించుకుంది. అద్భుతమైన ప్రతిభతో తొలి టూర్ టైటిల్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. రియో ఒలింపిక్స్ లోను అద్భుతమైన ప్రతిభ కనపర్చిన అదితి ఫైనల్ రౌండ్‌లో ఓటమి చవి చూసింది.
ఇక క్రికెట్‌లో విరాట్ కోహ్లీ….కింగ్ కోహ్లీగా నిలిచాడు. వరుస ఐదు టెస్టు సిరీస్‌లలో భారత్‌కు విజయాలను అందించి….గత రికార్డులను చెరగరాశాడు. అంతేగాదు భారత్‌కు వరుసగా 18 టెస్ట్ విజయాలను అందించి తిరుగులేని కెప్టెన్‌గా అవతరించాడు. భారత్ జైత్రయాత్రలో ఎక్కడైనా కోహ్లి ముద్ర కనిపించింది. అన్నీ తానే అయి ఒంటి చేత్తో అందించిన విజయాలు కొన్నైతే… ముందుండి సహచరులను నడిపిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ అందించిన ఫలితాలు మరికొన్ని. మూడు ఫార్మాట్‌లలోనూ 2016లో కోహ్లి సాగించిన పరుగుల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఏకంగా మూడు డబుల్ సెంచరీలు సాధించి 75.93 సగటుతో టెస్టుల్లో అతను పరుగులు సాధించాడు. వన్డేల్లో మరో మూడు శతకాలతో 92.37 సగటుతో అతను సరిగ్గా 100 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం. ఇక 2016 ఐపీఎల్‌లోనూ ఈ సూపర్‌మ్యాన్ 16 మ్యాచ్‌లలో 4 శతకాలు సహా 973 పరుగులు చేయడం విశేషం.
కబడ్డీలో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వరల్డ్ కప్‌ను గెల్చుకుంది. వరుసగా మూడో సారి ప్రపంచ కప్‌ను గెల్చుకున్న భారత్..కబడ్డీలో తిరుగులేదని నిరూపించుకుంది. భారత హాకీ చరిత్రలో స్వర్ణ యుగాన్ని తలపిస్తు ఆసియా కప్ గెల్చుకోగా…హాకీ జూనియర్ టీమ్ సొంతగడ్డపై ప్రపంచ కప్‌ను గెల్చుకుంది. పారాలింపిక్స్‌లో దేవెంద్ర ఝజారియా జావెలెన్ త్రో విభాగంలో రెండు సార్లు(2004,2016) గోల్డ్ మెడల్ సాధించిన భారత అథ్లెట్ గా రికార్డు సృష్టించాడు. ఇక తొలిసారిగా పారాలింపిక్స్‌లో పాల్గొన్న మారియప్పన్ తంగవేలు బంగారు పతకం,దీపా మాలిక్ సిల్వర్ మెడల్,వరుణ్ బాటి కాంస్య పతకాన్ని సాధించి సత్తాచాటారు. టెన్నిస్ విభాగంలో హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా…మహిళల డబుల్స్ విభాగంలో నెంబర్ వన్ ర్యాంకును పదిలంగా ఉంచుకుంది.
మరోవైపు రియో ఒలింపిక్స్‌లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన భారత షూటర్స్,బాక్సర్స్ నిరాశ మిగిల్చారు.డోపింగ్ టెస్టులో పట్టుబడ్డ రెజ్లర్ నర్సింగ్ యాదవ్…వివాదాస్పదంగా నిలిచాడు.ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాన్ని తీసుకురావాలని ఎంతో ఆశతో రియోకి వెళ్లిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు తీవ్రమైన నిరాశ ఎదురైంది. డోపింగ్ కేసులో నర్సింగ్ యాదవ్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఇచ్చిన క్లీన్ చిట్‌ను అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) తోసిపుచ్చి నాలుగేళ్ల నిషేధం విధించడంతో బరిలోకి దిగకముందే అతని ఆశలు నీరుగారి పోయాయి.జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించింది. అండర్ -20 అథ్లెటిక్స్‌లో 86.48 మీటర్లు విసిరిన తొలిభారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
ఇక బీసీసీఐ…లోథా కమిటీ మధ్య వార్ కొనసాగుతునే ఉంది. క్రికెట్‌లో సంస్కరణలు, ఐపీఎల్‌లో బెట్టింగ్ కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో రిటైర్డ్ ఛీప్ జస్టిస్ ఆర్ ఎమ్ లోథా కమిటీని సుప్రీం కోర్టు నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ బీసీసీఐలో సమూల మార్పులను సూచిస్తూ సంస్కరణలు చేపట్టాలని పలు సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే. లోథా కమిటీ చేసిన పలు సూచనలపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో లోథా కమిటీ…సుప్రీంను ఆశ్రయించింది.