చిక్కుల్లో గౌతమి….

269
Senior Tamil actor Gautami
- Advertisement -

దివంగత సీఎం జయలలిత మరణంపై ,.. గౌతమి రాసిన లేఖతో తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది, అన్నాడీఎంకే నేతలు నటి గౌతమిపై ఎదురుదాడి మొదలుపెట్టారు. లేఖతో దేశం దృష్టిని ఆకర్షించిన గౌతమిపై అన్నాడీఎంకే నేతల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా సాగుతున్న కుట్రలో గౌతమి పావుగా మారారని విమర్శిస్తున్నారు. కుట్రదారులకు ఆమె అమ్ముడుపోయారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Senior Tamil actor Gautami

జయ కన్నుమూసి వారం రోజులు గడుస్తున్నా ఆమె మృతిపై సందేహాలు వీడడం లేదు. ఈ క్రమంలో గౌతమి రాసిన లేఖ అందరినీ ఆలోచింప జేసింది. ‘అమ్మ’ వచ్చేస్తారని ప్రకటించిన తర్వాతి రోజే అమ్మ పరిస్థితి సీరియస్‌గా ఉందని ప్రకటించడమేంటని, ఆ తర్వాత కన్నుమూశారని చెప్పడమేంటంటూ లేఖలో గౌతమి ప్రశ్నల వర్షం కురిపించారు.

గౌతమి లేఖతో ఉలిక్కిపడిన అన్నాడీఎంకే వర్గాలు ఆమెపై ఎదురుదాడికి సిద్ధమయ్యాయి. ఆమెను ఇరకాటంలో పెట్టేలా ఆ పార్టీ నేతలు ఆరోపణల తూటాలను సంధిస్తున్నారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి నాంజిల్ మాట్లాడుతూ గౌతమి లేవనెత్తిన ప్రశ్నలను ఖండించారు. ప్రపంచస్థాయి వైద్యులతో జయకు చికిత్స అందించిన విషయాన్ని ఆమె గుర్తించాలన్నారు. హద్దులు మీరిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. గౌతమి వ్యాఖ్యలు పార్టీని చీల్చేవిగా ఉన్నాయని నాంజిల్ అన్నారు. కుట్రలో భాగంగానే ఆమె లేఖ రాసినట్టు ఆరోపించారు.

Senior Tamil actor Gautami

గౌతమి వ్యాఖ్యలు శోచనీయమని మరో అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి పేర్కొన్నారు. గవర్నర్ సహా కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు జయలలితను పరామర్శించేందుకు వచ్చి ఆమె ఆరోగ్యంగా ఉన్నారంటూ మీడియాతో పేర్కొన్న సంగతిని ఆమె గుర్తించాలని హితవు పలికారు. అర్థంపర్థం లేని ఆరోపణలు మానుకుంటే మంచిదని సూచించారు. కాగా గౌతమి వ్యాఖ్యలను నటుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖరన్ సమర్థించడం గమనార్హం.

- Advertisement -