దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తానని ప్రకటించిన విషయం విదితమే. దానికి టైటిల్ ను కూడా వర్మ అనైన్స్ చేశాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో తను సినిమాను రూపొందిస్తానని వర్మ ప్రకటించాడు.
అయితే ఈ టైటిల్ తో ఎన్టీఆర్ బయోపిక్ పై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెబుతోంది. అలాంటి సినిమాను తీస్తే వర్మను తెలుగునాట తిరగనివ్వమని టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆ హెచ్చరికపై వర్మ కూడా ఘాటుగా స్పందించాడు. ఆంధ్ర, తెలంగాణలు మీ బాబు సొత్తా? అని వర్మ ప్రశ్నించాడు.
ఇక ఈ సంగతి ఇలా ఉంటే..సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ పై లక్ష్మి పార్వతి స్పందించారు . బయోపిక్ ను స్వాగతిస్తూ..ఈ బయోపిక్ తీసేది ఎవరైనా వారు తన అనుమతిని తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. తాను ఎన్టీఆర్ భార్యనని, ఈ విషయంలో ఎవరైనా అనుచితంగా మాట్లాడితే వారిపై కోర్టులో కేసు వేయడానికి కూడా వెనుకాడనని ఆమె హెచ్చరించారు. ఎన్టీఆర్ తో తన పెళ్లికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రత్యక్ష సాక్షి అని ఆమె వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా వాస్తవాలను చూపే సినిమా రావాలని ఆమె అన్నారు. వాస్తవాలు కనుమరుగయ్యేలా సినిమా తీస్తే తాను ఒప్పుకోనని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో వర్మ ఈ సినిమా పై లక్ష్మీపార్వతి తో చర్చిస్తానని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.