క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుతం తన ట్వీట్లతో సోషల్ మీడియాలో నవ్వుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తులెవరైనా.. సంధర్బం ఏదైనా.. తన పంచులతో ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నాడు సెహ్వాగ్. డాషింగ్ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న వీరూకు ఎదైనా సరే షార్ట్‌లో అయిపోవాల్సిందే. గ్రౌండ్‌లో ఉన్నంతవరకు బాదడమే తెలిసినా సెహ్వాగ్.. తాజాగా బీసీసీఐకి భారత హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సాధారణంగా దేనికైనా దరఖాస్తు చేసుకునేటపుడు పూర్వానుభవాలను గురించి దరఖాస్తులో పేర్కోంటారు.. అయితే సెహ్వాగ్ మాత్రం అవేమి లేకుండా కేవలం రెండు లైన్లతో దరఖాస్తు చేసుకున్నాడట..
వివరాళ్లోకి వెళ్తే.. జూన్ 20తో టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్‌కుంబ్లేతో ఒప్పందం ముగియనుండడంతో బీసీసీఐ కొద్ది రోజుల క్రితం భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పదవి కోసం సెహ్వాగ్ తాను ఆ పదవికి ఏ విధంగా అర్హుడన్న విషయాన్ని కేవలం రెండు లైన్లలోనే వివరించాడట. అది కూడా ఏమని అంటే… ‘ప్రతిష్ఠాత్మక ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కోచ్, మెంటార్(మార్గ నిర్దేశకుడు)గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ప్రస్తుత భారత జట్టులో ఉన్న ఆటగాళ్లందరితో కలిసి గతంలో ఆడాను’ అని మాత్రమే పేర్కొని దరఖాస్తును పంపాడట. అనుభవం, తన నైపుణ్యాలు, ప్రత్యేకతల గురించి వివరించే ఎలాంటి పత్రాలను జతచేయలేదట.
సెహ్వాగ్ దరఖాస్తు చూసిన బీసీసీఐ ప్రతినిధులు షాక్ తిన్నారట. ప్రోటోకాల్ లేకుండా దరఖాస్తు చేస్తే ఏం చేయాలో తమకు కూడా అర్థం కావడం లేదని ఒక అధికారి పేర్కోన్నట్టు సమాచారం. దరఖాస్తుతో పాటు తాను ఏ విధంగా ఈ పదవికి అర్హుడన్న విషయాన్ని తెలియజేసే పత్రాలను జతచేయాలని కోరారట. అయితే వీరూ మాత్రం బీసీసీఐలో కొందరు అధికార్ల ఒత్తిడితోనే ఈ దరఖాస్తు చేసినట్లు తెలిసింది. కోచ్ పదవి మీద పెద్దగా ఆసక్తి లేనట్టుంది వీరూకి.. అందుకే ఇలా దరఖాస్తు పంపి.. మైదానంలోనూ.. ఎక్కడైనా నేనింతే అన్న సందేశం బీసీసీఐకి పంపినట్లు తెలుస్తోంది..
ఛాంపియన్స్ ట్రోఫీలో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన సెహ్వాగ్ త్వరలో స్వదేశానికి రానున్నాడు. భారత కోచ్ పదవి కోసం ఆరు దరఖాస్తులు అందినట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. గంగూలీ, లక్ష్మణ్, సచిన్‌తో కూడిన క్రికెట్ సలహా మండలి త్వరలో కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ ఇంటర్వ్యూలు ఇంగ్లాండ్‌లో నిర్వహిస్తారని, సెహ్వాగ్‌ను స్కైప్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారని ప్రచారం జరుగుతోంది.