తెలంగాణలోని అర్హులైన ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని..ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో కొత్త పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకూడదని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు.దరఖాస్తు చేసుకున్న ఒంటరి మహిళల వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలి. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్ అందేలా చూడాలి. అర్హుల ఎంపికలో ఎలాంటి రాజకీయ లేదా ఇతర ప్రలోభాలకు తావులేకుండా పూర్తి పారదర్శక విధానాన్ని అనుసరించాలి.
Also Read:డిలిమిటేషన్ బిల్లుపై డీఎంకే
ప్రస్తుతం పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుల వివరాలను తక్షణమే గుర్తించి, వారి పేర్లను పెన్షన్ జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా నిజమైన పేదలకు మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం పేదరిక నిర్మూలన, సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తోందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. కుటుంబ ఆసరా లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఒంటరి మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్క ఒంటరి మహిళకు ప్రభుత్వ ఆసరా అందాలి. ఆగస్టు 15 నాటికి అర్హుల తుది జాబితాను సిద్ధం చేసి, పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి అని మంత్రి సీతక్క తెలిపారు.ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నిరుపేద ఒంటరి మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. ఈ పథకం సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

