అమరావతి రాజధాని ప్రాంతంలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో కలిసి భూ సమీకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రాజధాని అభివృద్ధి కోసం రైతుల సహకారం కీలకమని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ రెండో విడతలో తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల రైతుల నుంచి మొత్తం 16,666.57 ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాలతో పాటు అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో భూ సమీకరణ జరగనుంది.
రైతులకు భూ సమీకరణ పథకం ద్వారా ఇచ్చే అభివృద్ధి ప్లాట్లు, ఆర్థిక లాభాలు, మౌలిక వసతులపై అధికారులు వివరించారు. రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి, పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియను చేపడతామని హామీ ఇచ్చారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Also Read:TTD:రేపటితో వైకుంఠ దర్శనాలు క్లోజ్!

