ఈ నెల 18 లోపు ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలి- ఎస్‌ఈసీ

205
SEC Parthasarathi
- Advertisement -

జిహెచ్ఎంసి ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్ధులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజులలోపు అంటే ఈ నెల 18వ తేదీ లోపు తమ ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల అధికారికి సమర్పించాలని, లేని పక్షంలో మూడు సంవత్సరాల వరకు ఎన్నికలలో పోటీ చేసేందుకు అర్హత కోల్పోవడంతో పాటు, గెలిచిన అభ్యర్ధి అయిన పక్షంలో పదవి కూడా కోల్పోతారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్. పార్థసారధి అన్నారు.

శుక్రవారం (08.01.2021) రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశ మందిరంలో ఎన్నికల అధికారి, కమిషనర్, జిహెచ్ఎంసి, జోనల్ కమిషనర్లు మరియు ఎన్నికల వ్యయ పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఈసీ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను ఈ నెల 18 వ తేదీ లోపు సమర్పించాల్సి ఉన్నందున ఇప్పటి వరకు ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించని అభ్యర్ధులకు అట్టి విషయాన్ని తెలియపరుస్తూ తాఖీదులు జారీచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు ఉన్నందున అభ్యర్ధులు సమర్పించాల్సిన అఫిడవిట్లు వీలైనంత తొందరలో పూర్తి చేసి సమర్పించాలని సూచించారు.

మొత్తం పోటీచేసిన 1122 మంది అభ్యర్ధులకు గాను 999 మంది తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించారని, మిగిలిన 123 మంది అభ్యర్ధులు గడువులోపు సమర్పించేలా చూడాలని, లేని పక్షంలో అట్టి అభ్యర్ధులు అనర్హతకు లోనౌతారని అధికారులకు సూచించారు. అధికారులు తమ విధులు నిర్వహించే విషయంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఎక్స్ పెండిచర్ మానిటరింగ్ కమిటీ రిపోర్టుతో సరిచూసి, స్క్రూటినీ చేసి ఎన్నికల ఖర్చుల వివరాలను ఫైనల్ చేయాలని, ఎన్నికల అధికారి మరియు జిహెచ్ఎంసి కమిషనర్ ఈ నెల 25 వ తేదీ లోపు తుది రిపోర్టును ఎన్నికల సంఘానికి సమర్పించాలని సూచించారు. ఈ సమావేశానికి జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్లు, ఎన్నికల వ్యయ పరిశీలకులు పాల్గొన్నారు.

- Advertisement -