ముంబైకి చెందిన వాకేశ్వర్ నివాసి, వ్యాపారి కేతన్ షాను ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో విధించిన రూ.5 లక్షల జరిమానాను చెల్లించకపోవడంతో ప్రత్యేక సెబీ (SEBI) కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, కోర్టు ఆయనపై మొత్తం రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. అయితే రూ.25,000 తక్షణమే చెల్లించి, మిగిలిన మొత్తాన్ని 30 రోజుల్లోపు జమ చేస్తానని హామీ ఇవ్వడంతో జైలు శిక్షను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం, విధించిన మొత్తం జరిమానాలో రూ.5 లక్షలు సెబీకి చెల్లించాల్సి ఉంటుంది. అభియోగ పక్షం వివరాల ప్రకారం, సెబీ 2010 మే 1 నుంచి 2011 జనవరి 31 వరకు స్పెక్టకిల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ (SIL) షేర్ల ట్రేడింగ్‌పై విచారణ చేపట్టింది. ఈ సమయంలో కంపెనీ షేర్ ధర రూ.21.75 నుంచి ఒక్కసారిగా రూ.162.80 వరకు పెరిగినట్లు గుర్తించింది. రోజువారీగా ట్రేడైన షేర్ల సంఖ్య కనిష్టంగా 31 నుంచి గరిష్టంగా 79,68,043 వరకు ఉన్నట్లు విచారణలో తేలింది.
విచారణలో, కేతన్ షా సహా పలువురు వ్యక్తులు పరస్పరం అనుసంధానమై, పలు బ్రోకర్ల ద్వారా SIL షేర్లలో అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించినట్లు బయటపడింది. దీనిపై విచారణాధికారి 2014 డిసెంబర్ 22న కేతన్ షాపై రూ.5 లక్షల జరిమానా విధించారు.
అయితే, ఈ జరిమానాను చెల్లించని కేతన్ షా, సెబీ ఉత్తర్వులను సవాలు చేస్తూ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (SAT)ను ఆశ్రయించాడు. 2016 డిసెంబర్ 15న SAT కూడా ఆయన అప్పీల్‌ను తిరస్కరించినప్పటికీ, మూడు నెలల్లోపు జరిమానా చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. అయినా, ఆ గడువులోనూ మొత్తాన్ని జమ చేయకపోవడంతో సెబీ క్రిమినల్ చర్యలు ప్రారంభించింది. నిర్ణీత కాలంలో జరిమానా చెల్లించకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి ఈ శిక్ష విధించింది.
Also Read:వాట్సాప్ డేటా సేకరణ..అనుమతి తప్పనిసరి!

