సింగరేణిలో కరోనా కట్టడికి చర్యలు.. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ..

58
mlc kavitha

సింగరేణిలో కోవిడ్ మహమ్మారి కట్టడికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సింగరేణి యాజమాన్యంతో, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు అనేక చర్యలు చేపడుతోంది. కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు మొదలు వైద్య సేవలు, క్వారంటైన్‌ సెంటర్‌ల ఏర్పాటు, ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వరకు అన్ని దశల్లో కరోనా కట్టడికి కృషి టీబీజీకేఎస్ చేస్తున్నది. సింగరేణి సీఎండీ శ్రీధర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రూ.3.16 కోట్లతో లక్ష పదివేల రాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు, భారీ ఎత్తున పరీక్షలు, 25 వేల మందికి వ్యాక్సినేషన్, 1,400 బెడ్ లతో ప్రత్యేక వార్డుల ఏర్పాటు చేశారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న కరోనా ప్రత్యేక వార్డు ల్లోనూ, ఐసోలేషన్ సెంటర్లలో అందిస్తున్న వైద్య సేవలతో 9,650 మంది పూర్తిగా కోలుకున్నారు. సింగరేణిలో మొత్తం కార్మికుల సంఖ్య 44వేలు కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసులుగా ఉండి వైద్యం పొందుతున్న కార్మికుల సంఖ్య కేవలం 560 మాత్రమే. ప్రభుత్వ సహా కారంతో సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే 27 వేల మందికి వాక్సినేషన్ కూడా పూర్తి చేసింది. మరో 50 వేల మందికి వాక్సినేషన్ చేయించడం కోసం వాటిని తయారీదారుల నుండే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

కరోనా తీవ్రంగా ఉన్న వారిలో ఇప్పటి వరకు 862 మందికి హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్య సేవలకు గాను, సింగరేణి యాజమాన్యం సుమారు 38 కోట్ల రూపాయలను వెచ్చించింది. సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 673 బెడ్ లకు అదనంగా, రూ.43 లక్షలతో మరో 755 బెడ్ లను ఏర్పాటు చేశారు. సుమారు 80 లక్షల రూపాయలతో వివిధ రకాలమందులు, ఆక్సిజన్ మీటర్ వంటి 18 రకాల వస్తువులు గల కిట్లను కొనుగోలు చేసి హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి అందజేశారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్నఆసుపత్రులకు అవసరమై ఉన్న రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, ఫెవి పెరావిర్ వంటి మందులను 5.55 కోట్లలతో సమకూర్చడం జరిగింది.

ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు, 3.60 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు, 1.18 కోట్ల రూపాయలతో 370 ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేశారు. కొవిడ్ వార్డులకు అవసరమైన 20 మంది అదనపు డాక్టర్లను, 250 మంది సిబ్బందిని కూడా కాంట్రాక్టు పద్ధతిన నియమించారు. కోవిడ్ పేషెంట్లకు సింగరేణి సంస్థ పౌష్టిక ఆహారం అందిస్తోంది. దీని కోసం 1.50 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు వెచ్చించింది. వీటితోపాటు శానిటేషన్ లిక్విడ్, మాస్కులు,హ్యాండ్ శానిటైజర్లు వైద్యులకు కావలసిన పీపీ ఇ కిట్లు, మాస్కులు వంటివి అందజేసింది. కోవిడ్ వ్యాధి కారణంగా మృతి చెందిన ఉద్యోగులు 39 మంది ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను కూడా కంపెనీ చెల్లించింది.