లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్ 12న ఇండియా కూటమి నేతృత్వంలో సుప్రీంకోర్టు వరకు చేపట్టిన నిరసన ర్యాలీ, కోర్టు ప్రాంగణంలో జరిగిన ఆందోళనకు సంబంధించి ఆయన వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకురావడాన్ని సహించబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ, ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో జరిగిన నిరసన అంశం చర్చకు వచ్చింది.
ఈ పిటిషన్లపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసినప్పటికీ.. రాజకీయ నేతల ప్రవర్తనను సమర్థించినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా నిరసన అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజకీయ ర్యాలీ నిర్వహించడంపై గౌరవ్ భాటియా అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ కోర్టు ముందుకు రాజకీయ ఊరేగింపు అంశం రావడం ఆమోదయోగ్యం కాదు. సుప్రీంకోర్టులో జరిగిన ఈ పరిణామం జరగకూడదు అని ఆయన పేర్కొన్నారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించి తమ దారికి తెచ్చుకోలేరు అని వ్యాఖ్యానించారు.ర్యాలీ, నిరసనల ద్వారా న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించారని గౌరవ్ భాటియా ఆరోపించారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ఇలాంటి ప్రయత్నాలు బలహీనమైనవని పేర్కొన్నారు.ఇవి ఎవ్వరూ పట్టించుకోని బలహీనమైన ప్రయత్నాలు. బయట వారు అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు. మేము ప్రపంచానికి దూరంగా ఉండే ఏకాంత గోపురంలో కూర్చోలేదు. బయట జరుగుతున్న పరిణామాల గురించి మాకు తెలుసు అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన నిరసనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
Also Read:ఢిల్లీ నిరసనలు..అరెస్టులపై పిటిషన్లు

