ప్రియా ప్రకాశ్ వారియర్ పేరు ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. ‘ఒరు ఆదార్ లవ్’లోని ‘మాణిక్య మలయార పూవి’ పాటతో ఒక్కరోజులో ప్రియ ఫేమస్ అయిపోయింది. కాగా ఈ పాటలోని లిరిక్స్ ముస్లింల మనోభావాలు అగౌరవపరిచేలా ఉన్నాయంటూ కొంతమంది యువకులు హైదరాబాద్ ఫలక్‌నుమా పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో కూడా కేసులు నమోదయ్యాయి.
అయితే చిత్రయూనిట్‌పై కేసు నమోదును ఛాలెంజ్ చేస్తూ..ఒరు ఆదార్ లవ్ హీరోయిన్ ప్రియాప్రకాశ్ వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా ప్రియా ప్రకాశ్ వారియర్ కు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది.
ఈ కేసును నేడు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, తెలంగాణ, మహారాష్ట్ర సహా అన్ని పోలీసు స్టేషన్లలో ప్రియా ప్రకాశ్ పై నమోదైన కేసులపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. ఆమెపైనా, ‘ఒరు అదార్ లవ్’ నిర్మాతలు, దర్శకుడిపై సినిమాకు సంబంధించి ఎటువంటి కేసులనూ నమోదు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఎక్కడా వారిపై కేసులు నమోదు చేయరాదని చెబుతూ, ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ ల పూర్వపరాలను, అందుకు సంబంధించిన సాక్ష్యాలను తమ ముందు ఉంచాలని సూచించింది.