త్వరలో అంగన్ వాడీ పాఠాలు దూరదదర్శన్, టీ- సాట్ ద్వారా ఆన్ లైన్‌లో అందించేందుకు మహిళా-శిశు సంక్షేమ శాఖ సిద్ధం అయింది. కరోనా వైరస్ నేపథ్యంలో చిన్న పిల్లలకు కావల్సిన నీతి కథలు, విజ్ణాన విషయాలు ఇంటి నుంచే నేర్పించేందుకు ఈ ఆన్ లైన్ విధానం బాగా ఉపయోగపడుతుందని భావించి, దూరదర్శిని టీవి, టీ-సాట్ ద్వారా వీటిని అందించేందుకు పాఠ్యాంశాలు సిద్ధం చేస్తున్నట్లు మహిళా- శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, గిరిజన సంక్షేమ, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు వివరించారు.
కరోనా కట్టడి కోసం అమలు చేసిన లాక్ డౌన్ సమయంలో మహిళా-శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్ వాడీ సరుకులు, ఇతర సేవలపై నేడు హైదరాబాద్, దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ ఆ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, టిఎస్ ఫుడ్స్ ఇన్ ఛార్జీ క్రిస్టినా జడ్ చోంగ్తుతో కలిసి సమీక్ష చేశారు. ఆహార కొరతను అధిగమించిన తెలంగాణ పోషకాహార కొరతను కూడా అధిగమించాలన్న సిఎం కేసిఆర్ ఆలోచన మేరకు అంగన్ వాడీలలో పిల్లలకు అందించే మురుకులను మరింత పోషకాహరంగా తయారు చేయాలన్నారు.
లాక్ డౌన్ సమయంలో అంగన్ వాడీ పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు ఇచ్చే పాలు, గుడ్లు, పప్పులు, నిత్యావసర వస్తువులు ఆర్టీసి కార్గో బస్సులు, ఇతర వాహనాలతో సాధారణ సమయం కంటే ఎక్కువ శాతం పంపిణీ జరిగినట్లు కమిషనర్ దివ్య, మంత్రికి వివరించారు.
లాక్ డౌన్ సమయంలో అంగన్ వాడీ సరుకులు అందకుండా పేదలు ఇబ్బంది పడకూడదన్న సిఎం కేసిఆర్ ఆదేశాల మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ మార్గదర్శకాలతో ఇంటింటికి అంగన్ వాడీ సేవల పేరుతో లాక్ డౌన్ సమయంలోనూ సాధారణ సమయం కంటే ఎక్కువ పనిచేసినట్లు తెలిపారు.ఇంటింటికి అంగన్ వాడీ సరుకుల కార్యక్రమం విజయవంతం అయిందని, గ్రామాల్లో కూడా మంచి స్పందన వచ్చిందన్నారు.