ఆయేషామీరా హత్యకేసులో ఎనిమిదిన్నరేళ్లుగా సత్యంబాబు గత రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించి ఈ రోజు (ఆదివారం) విడుదలయ్యాడు. ఈ సందర్భంగా ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..తాను నిర్దోషినని గుర్తించి, తనకు సహకారం అందించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఆ సందర్భంలో, ఆ ప్రాంతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసని, కాని తాను శిక్ష అనుభవించాల్సి వచ్చిందని వాపోయాడు.
ఇంతకాలానికైనా న్యాయం గెలిచిందని, దేవుడు తన పక్షాన ఉన్నాడని రుజువైంద చెప్పాడు సత్యం. కాని తనలాగే ఎంతో మంది అన్యాయంగా జైల్లో మగ్గుతున్నారని, వారందరికీ ప్రభుత్వం సహకరించాలని కోరాడు. అంతేకాకుండా తన కుటుంబం దీనస్థితిలో ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని అన్నాడు. తాను అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేశాడని, అందరి సహకారంతో బయటకు వచ్చానుఅన్నారు.
అయితే తన కోసం తన గ్రామస్తులు ధర్నాలు చేశారని, తన గ్రామప్రజల మేలు ఎన్నటికీ మర్చిపోలేనని అన్నాడు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నాడు. అయితే అతడు మాట్లాడుతున్నప్పుడు ఉచ్చరణ సరిగా పలకలేదు. తాను ఇన్నాళ్లు జైల్లో ఉండడం వల్ల తనకు ఉచ్చరణ సరిగా రావడం లేదని అన్నాడు.
కొడుకు విడుదల గురించి అతడి తల్లిని ప్రశ్నించగా ‘‘నా కొడుకు జైలు నుంచి విడుదలైనందుకు సంతోషంగా ఉంది. అన్నిటికీ ఆ యేసయ్యే ఉన్నాడు’’ అని సమాధానం చెప్పింది.