ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించడంలో భాగంగా ఇల్లందు నియోజక వర్గంలోని ప్రతి ఎకరాకు నీరు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, ఎన్ని ఎకరాలకు నీటి వసతి ప్రస్తుతం లేదో వెంటనే సర్వే చేసి పది రోజుల్లో ఇవ్వాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆదేశించారు. ఇల్లందు, మహబూబాబాద్ నియోజక వర్గాల్లోని ప్రతి ఎకరాకు నీరందించే ఎజెండాతో నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ ఛీప్ మురళీధర్ రావు, సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వెంకట కృష్ణ, ఎస్.ఆర్.ఎస్.పి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ శంకర్, సూపరింటిండెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లతో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సమీక్ష చేశారు.
ఇల్లందు నియోజక వర్గ పరిధిలో ప్రస్తుతం నీరు అందని భూమి ఎంత ఉందో సర్వే చేసి పది రోజుల్లో నివేదిక అందించాలని, దాంతో పాటు ఆ ప్రాంతంలోని ప్రతి ఎకరాకు నీరు అందించేందుకున్న మార్గాలు, వసతులు, నీటి లభ్యత, అవసరంపై సమగ్ర ప్రణాళిక రూపొందించి సమర్పించాలన్నారు.
ప్రస్తుతం ఉన్న చెరువులు విస్తీర్ణం పెంచుకోవడం వల్ల నీరందించే అవకాశం ఎంతవరకు ఉంది, లేనిపక్షంలో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను నివేదికలో పొందుపర్చాలని ఇంజనీర్ ఇన్ ఛీప్ మురళీధర్ రావు అధికారులకు సూచించారు.
రోళ్లపాడు, లలితాపూర్ ట్యాంక్ నుంచి బయ్యారం ట్యాంక్ వరకు పొడగించే విధంగా చూడాలన్నారు. ఇల్లందు నియోజక వర్గంలో చివరి ఎకరాకు కూడా నీరందించేందుకు గల మార్గాలన్నింటిని సూచిస్తూ నివేదిక ఇవ్వాలన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ అపర భగీరథ ప్రయత్నం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మహబూబాబాద్ జిల్లాలో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి పోస్తున్నాయని, ఈ చెరువుల్లోని నీరు ప్రతి ఎకరాకు చేరే విధంగా ఓటీలు నిర్మించాలని చెప్పారు. ఈ రెండు నెలల్లోనే కాలువల నిర్మాణం, మరమ్మత్తులు, ఓటీలు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందించేలా పనులు ప్రారంభించాలన్నారు.