కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? ఏడాదిన్నరగా దేశ వ్యాప్తంగా సినిమా లవర్స్ అంతా ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. ఇంకో వారం రోజుల్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరకనుంది. అయితే ఇప్పడు అదే కట్టప్ప వ్యవహారం రాజమౌళీకి తలనొప్పిని తెచ్చిన సంగతి తెలిసిందే. కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ వ్యాఖ్యలు చేసినందున, ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ చిత్రాన్ని కన్నడనాట విడుదల చేయనివ్వబోమని పలు సంఘాలు భీష్మించుకుని కూర్చున్న నేపథ్యంలో రాజమౌళి స్వయంగా కన్నడలో మాట్లాడి సినిమాను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
రాజమౌళి కన్నడలో మాట్లాడినంతమాత్రాన సరిపోదని, సత్యరాజ్ తో క్షమాపణలు చెప్పించాలని కన్నడ ధళవళపార్టీ నాయకుడు వాటాళ్ నాగరాజు సూచించారు. కట్టప్ప నేరుగా కర్ణాటకకి వచ్చి క్షమాపణ చెప్పకపోయిన , సోషల్ మీడియా ద్వారా అయిన అప్పుడు మాటలు వెనక్కు తీసుకుంటే సరిపోతుందని వారు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు దిగొచ్చిన సత్యరాజ్ కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన చేశారు. తాను కన్నడ ప్రజలకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తన వల్ల బాహుబలి వంటి గొప్ప చిత్రానికి ఇబ్బందులు రావడం ఇష్టం లేదని, ఈ సినిమాను ప్రతి ఒక్కరికీ చేర్చాల్సి వుందని అన్నారు. కన్నడ ప్రజలంటే తనకెంతో గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. గతంలో తన వ్యాఖ్యల పట్ల ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.