తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం రాష్ట్రంలో రాజకీయం కీలకమలుపు తిరిగింది. అమ్మ నెచ్చెలి, ప్రాణసఖిగా ఉన్న శశికళకు అన్నాడీఎంకే నేతలు పార్టీ బాధ్యతలు అప్పగించారు. కొద్దిసేపటి క్రితం ‘చిన్నమ్మ’ను కలిసిన నేతలు.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు.
ఇదిలా ఉంటే జయలలిత కన్నుమూసిన తరువాత మొదటి సారిగా తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ సమావేశానికి ముందు జయలలిత సమాధి వద్ద పన్నీర్ సెల్వంతో పాటు ఆ రాష్ట్రమంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం సచివాలయ భవనంలోనూ జయలలిత చిత్రపటాన్ని ఉంచి ఆ ఫొటో ముందే కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. జయలలిత పేరిట మెరీనా బీచ్ వద్ద ఘాట్ నిర్మాణానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జయలలిత రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. జయలలిత స్మారక విగ్రహాల ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించుకుంది.
ఇదిలా ఉంటే అమ్మ సీఎంగా ఉన్నప్పుడు ఆమె వ్యతిరేకించిన మధురవాయల్- చెన్నై పోర్టు పనుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదించింది. జయలలిత వ్యతిరేకించిన మధురవాయల్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వివాదస్పదమవ్వడంతో అమ్మ సీఎంగా ఉన్నప్పుడు వ్యతిరేకించింది.