స్టైలీష్స్టార్ అల్లు అర్జున్ సరైనోడు సినిమా విడుదలై రెండు సంవత్సరాలు అయినా నెట్టింట్లో ఈ సినిమాకు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ మూవీ విడుదల సమయంలో వచ్చిన రివ్యూస్ ని పబ్లిక్ రెస్పాన్స్ ని కనక గుర్తుకు తెచ్చుకుంటే యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు అన్నది నిజం. అయితే అది మొదటి రెండు మూడు రోజుల మాట. ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. దర్శకుడు బోయపాటి శీను తనకు మాస్ పల్స్ మీద ఎంత పట్టు ఉందో కలెక్షన్ రూపంలో ఋజువు చేసి చూపించాడు. అల్లు అర్జున్ ఊర మాస్ అవతారం కూడా దీనికి బాగా కలిసొచ్చిందని చేప్పుకోవాలి.
అయితే మన తెలుగు హీరో కాబట్టి ఇలాంటి రికార్డులు సహజం అనుకోవచ్చు. కాని అల్లు అర్జున్ సినిమాలు ఇక్కడ కంటే హింది – మలయాళంలో రికార్డులు సృష్టించడం ఎప్పుడూ ఆసక్తి రేపేదే. సరైనోడు హింది వెర్షన్ తాజాగా మరో అరుదైన రికార్డు తన సొంతం చేసుకుంది. ఇప్పటి దాకా యు ట్యూబ్ లో ఏ భారతీయ సినిమాకు దక్కని ఘనతను తన సొంతం చేసుకుంది. ఇప్పటి దాకా ఈ సినిమాకు 145 మిలియన్ వ్యూస్ దక్కాయి. అంటే 14 కోట్ల 50 లక్షలకు పైగా ఈ వీడియో లింక్ ని ఓపెన్ చేసారన్న మాట. అంతే కాదు 5 లక్షల లైక్స్ దక్కించుకున్న తొలి ఇండియన్ మూవీగా కూడా సరైనోడు కొత్త ట్రెండ్ సెట్ చేసింది.
హింది సినిమా చరిత్రలో గొప్ప సినిమాలుగా చెప్పుకునే షోలే – దిల్వాలే దుల్హనియా లేజాయేంగే – హం ఆప్ హై కౌన్ – మొగల్ ఎ ఆజాం లాంటివి యు ట్యూబ్ లో అధికారికంగా ఉచితంగా చూసే వెసులుబాటు లేదు. అందుకే సరైనోడు లాంటి మాస్ సినిమాలకు ఇంత ఆదరణ దక్కుతోంది. అంతేకాదు బన్నీ రికార్డుల వేట దీనితోనే ఆగడం లేదు. డిజే కూడా 124 మిలయన్ వ్యూస్ తో తక్కువ టైం సరైనోడుని క్రాస్ చేసేందుకు ఉరకలు వేస్తోంది. మొత్తానికి రెండు వంద మిలియన్ వ్యూస్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ట్రాక్ రికార్డు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు.