హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైయింది. అన్నపూర్ణ స్టూడియోస్ కింగ్ నాగార్జున తెలుగులో విడుదల చేసిన ఈ చిత్రం దీపావళి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
హీరో కార్తి మాట్లాడుతూ.. సర్దార్ చాలా ప్రతిష్టాత్మకమైన సినిమాగా చేశాం. ఈ సినిమా కోసం ఒక వార్ లా పని చేశాం. ఇప్పుడు ప్రేక్షకుల నుండి సర్దార్ కి అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా వుంది. ఖాకీ, ఖైధీ చిత్రాల్లానే కొత్తగా చేస్తే తప్పకుండా ఆదరిస్తామని ప్రేక్షకులు సర్దార్ తో మరోసారి నిరూపించారు. మేము పడ్డ కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చారు ప్రేక్షకులు.
పిఎస్ మిత్రన్ సినిమా కోసం ఒక కొత్త కాన్సెప్ట్ ని ప్రేక్షకులందరికీ అర్ధమయ్యేలా చెప్పడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. యూనిట్ లో అందరినీ సినిమాలో భాగం చేస్తాడు. అందరి నుండి సలహాలు, సూచనలు తీసుకుంటాడు. ఈ సినిమా కోసం రోజుకి ఇరవై గంటలు పని చేసి కూడా తర్వాత రోజు మళ్ళీ షూటింగ్ వెళ్లాను. దీనికి కారణం మిత్రన్ వర్కింగ్ స్టయిల్. చాలా ఎక్సయిమెంట్ తో ఈ సినిమా చేశాం. రజిషా విజయన్ అద్భుతంగా నటించింది. ఇది నేరుగా తెలుగులో చేసిన సినిమాలా అద్భుతంగా డైలాగులు రాశారు రాకేందుమౌళి.
అభిమాన్యుడు తర్వాత సెల్ ఫోన్ చూసి ఎలా భయపడ్డారో .. సర్దార్ చూసిన తర్వాత బాటిల్ చూస్తుంటే భయపడుతున్నారు(నవ్వుతూ). నాగార్జున అన్న సపోర్ట్ ని మర్చిపోలేను. సుప్రియ ప్రెస్ మీట్ కి రావడం అనందంగా వుంది. నిర్మాత లక్ష్మణ్ కి కృతజ్ఞతలు. సినిమా అనేది ఒక కల్చర్ గా వున్న మన దేశంలో ఒక నటుడిగా వుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అభిమానులతో కలసి సర్దార్ చూడటానికి వెళ్తున్నాను. సర్దార్ కి ఘన విజయం అందించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు.
సుప్రియ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలలో సర్దార్ సినిమా విడుదల చేసినందుకు చాలా గర్వంగా వుంది. కార్తి సినిమాని రిలీజ్ చేయడం ఎప్పుడూ సంతోషంగా వుంటుంది. కార్తి సినిమా అనగానే నాగార్జున మరో అలోచన లేకుండా విడుదల చేద్దామని చెప్పారు. సర్దార్ లాంటి మంచి సినిమా ఇచ్చిన కార్తి, మిత్రన్ లకు కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు నిజంగా దేవుళ్ళు. ఎక్కడ మంచి సినిమా వున్నా చూసేది మన తెలుగు ప్రేక్షకులే. మాపై నమ్మకం ఉంచిన ప్రిన్స్ పిక్చర్స్ కు థాంక్స్. సర్దార్ సినిమాకి ఘన విజయం ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు” తెలిపారు.
రజిషా విజయన్ మాట్లాడుతూ.. సర్దార్ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇందు లాంటి మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు మిత్రన్ కి కృతజ్ఞతలు. సర్దార్ ఇందు పాత్రలు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు
దర్శకుడు పిఎస్ మిత్రన్ మాట్లాడుతూ.. నా తొలి చిత్రం అభిమన్యుడు సినిమాని తెలుగు ప్రేక్షకుల విజయం చేశారు. ఇప్పుడు సర్దార్ కి మరో ఘన విజయం ఇచ్చారు. కార్తి ఈ సినిమా చేయడం నా అదృష్టం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. మేము పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.
రాకేందుమౌళి మాట్లాడుతూ.. దీపావళి కానుకగా విదుదలైన సర్దార్ ఘన విజయం సాధించడం ఆనందంగా వుంది. థియేటర్ లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆవారా సినిమా నుండి కార్తి అన్నతో ప్రయాణం. ఈ సినిమాకి కూడా రాసే అవకాశం ఇచ్చారు. మిత్రన్ అద్భుతమైన కాన్సెప్ట్ మెసేజ్ తో సినిమాని తీశారు. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ కి వెళ్లి చూడాలి” అని కోరారు.