ట్విట్టర్ లో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పెట్టిన పోస్ట్ ఇప్పుడు దుమారం రేపింది. మీర్జా చేసిన ఆ ట్వీట్‌పై ఆమె ఫ్యాన్స్ తో పాటు ఇతర ప్రజలు కూడా సీరియస్ అయ్యారు. సెలబ్రిటీలు అన్నాక ఆయా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం మామూలే. క్రీడాకారులు, సినీ తారలు ఎక్కువగా బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉంటారు. అయితే ఇంత వరకూ ఓకే. కానీ ఇలా పనిచేయడంలో ఏదైనా తేడా జరిగితే మాత్రం అంతే.
అప్పుడు అభిమానులే కాదు, ఇతర వర్గాల ప్రజలు కూడా అలాంటి సెలబ్రిటీలను ఒక ఆట ఆడుకుంటారు. గతంలో నెస్లీ మ్యాగీతోపాటు ఇంకా ఇతర ప్రోడక్ట్స్ విషయంలో మనం ఇది చూశాం. అయితే ఇప్పుడలాంటి పరిస్థితే.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఎదుర్కొంటోంది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే…
వన్ ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ తెలుసు కదా. వన్ ప్లస్ అనే చైనాకు చెందిన ఓ కంపెనీ స్మార్ట్‌ఫోన్ అది. గత కొద్ది నెలల కిందటే ఆ ఫోన్ విడుదలైంది. అయితే ఆ ఫోన్ ప్రమోషన్ కోసం సానియా సదరు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఆమె తాను ఆ ఫోన్‌ను 3 నెలల నుంచి వాడుతున్నానని, చాలా బాగుందని, కావాలంటే మీరూ ఆ ఫోన్‌ను ట్రై చేయండి… అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రమోషన్ పోస్ట్ పెట్టింది.
అయితే ఈ అమ్మడు ఆ మ్యాటర్‌ని హడావిడిగా ట్వీట్ చేసిందో, లేదా జనం ఇవన్నీ పట్టించుకోరని అనుకుందో తెలియదు కానీ వన్ ప్లస్ 3టీ ఫోన్ వాడుతున్నానంటూ ఐఫోన్ నుంచి ట్వీట్ చేసింది. ఈ విషయంపై నెటిజన్లు సానియాపై సెటైర్లేస్తున్నారు. అంతేకాకుండా ట్విట్టర్ యూజర్లు టెన్నిస్ స్టార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఐఫోన్ యాప్ నుంచి చేసే ప్రతి ట్వీట్‌కు వయా ట్విట్టర్ ఫర్ ఐఫోన్ అని ట్యాగ్ వస్తుంది. ఆ విషయాన్ని గమనించలేకపోయిన సానియా ఈ ట్వీట్ చేసింది. దీంతో ఆమెపై యూజర్లు విరుచుకుపడ్డారు.
స్వప్రయోజనాల కోసం స్మార్ట్‌ఫోన్లను ప్రమోట్ చేస్తున్నదని ఆరోపించారు. ఐఫోన్ వాడుతూ వన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రమోషన్ చేయడం దారుణమన్నారు. అంతేకాకుండా..వన్ ప్లస్, ఐఫోన్ ఎప్పుడు కలిసిపోయాయంటూ సానియాకు చురకలంటిస్తున్నారు. కొందరేమో ఇలా సెలబ్రెటీలు తమ సంపాదన కోసం జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారని పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా సానియా చేసిన ఓ చిన్న పొరపాటు ఆమెపై ఆగ్రహానికి కారణమైంది. ఇదిలాఉంటే.. ఇవాళ ఇటాలియన్ ఓపెన్ టోర్నీలో సానియా సెమీస్ మ్యాచ్ ఆడనుంది.