ఐపీఎల్‌లో బెంగళూరు మళ్లీ చిత్తైపోయింది. ఓటముల పరంపర కొనసాగుతునే ఉంది. పంజాబ్ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక… 119 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ సీజన్ లో తొమ్మిదో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్‌లో ఎక్కువసార్లు ఆలౌట్ అయిన జట్టుగా డెక్కన్ చార్జర్స్(5) తర్వాతి స్థానంలో నిలిచింది బెంగళూరు(4).
స్పల్ప స్కోరే కావడంతో బెంగళూరు విజయం లాంఛనమే అనుకున్నారు కానీ సందీప్ స్వింగ్‌కు ఆరంభంలోనే చేతులెత్తేసింది ఆర్సీబీ. తొలి ఓవర్లోనే గేల్ (0)ను ఔట్ చేసిన సందీప్.. ఆ తర్వాత కోహ్లి (6)ని క్లీన్ బౌల్డ్ చేయడంతో చిన్నస్వామి స్టేడియం మూగబోయింది. ఒక ఎండ్‌లో మన్‌దీప్ సింగ్ అడపాదడపా బంతిని బౌండరీకి పంపినా.. మరోవైపు నుంచి ఆర్‌సీబీ వికెట్లు కోల్పోతూ వచ్చింది. సందీప్‌పై ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించిన డివిలియర్స్ (10) ఫోర్, సిక్స్ బాదినా.. ఆ వెంటనే ఔటయ్యాడు. పవర్‌ప్లే ఆఖరికి బెంగళూరు 46/3తో నిలిచింది. కోహ్లి, గేల్, డివిలియర్స్, వాట్సన్ లాంటి స్టార్లు మరోసారి విఫలం కాగా మన్‌దీప్‌సింగ్ (46; 40 బంతుల్లో 5×4, 2×6) ఒక్కడే పోరాడాడు. మన్ దీప్‌కు సహకారం అందించే వారు లేకపోవడంతో బెంగళూరు 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. సందీప్(3/22),అక్షర్(3/11), మాక్స్‌వెల్ (2/15), మోహిత్‌శర్మ (2/24) విజృంభించడంతో బెంగళూరు గాడి తప్పింది.
అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల 138 పరుగులు చేసింది. ఆదిలోనే తడబడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. చివర్లో అక్షర్ పటేల్ (17 బంతుల్లో 38 నాటౌట్) అద్భుతంగా రాణించడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ విజయంతో పంజాబ్ తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.