కమర్షియల్ చిత్రాలతో విజయాల్ని అందుకుంటున్న సందీప్ కిషన్ హీరోగా, కృష్ణగాడి వీర ప్రేమకథ చిత్రంతో యూత్ ని ఆకట్టుకున్న మెహరీన్ హీరోయిన్ గా “లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్” పతాకంపై “స్వామిరారా” చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ “c/o సూర్య” ని, ఫస్ట్ లుక్ ని ప్రముఖ హీరో సూర్య చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రాన్నికాన్సెప్టెడ్ కమర్షియల్ చిత్రం “నా పేరు శివ” ఫేమ్ సుసీంథరన్ దర్శకత్వం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈచిత్రానికి కబాలి చిత్రంలో యాక్షన్ తో ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన అంబు, అరివు లు యాక్షన్ కొరియోగ్రఫి చేశారు. “గజరాజు, జిల్లా, రైల్” వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ సంగీత దర్శకడు డి.ఇమ్మాన్ ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా సహ-నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. “నా పేరు శివ చిత్రంతో దర్శకుడి గా చాలా మంచి పేరు సంపాయించిన దర్శకుడు సుసీంథరన్ దర్శకత్వంలో “నా పేరు శివ” తరహాలో తెరకెక్కనున్న మా చిత్రం టైటిల్ “c/o సూర్య” ని, ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ హీరో సూర్య చేతుల మీదుగా విడుదల చేశాము. మా చిత్రం దర్శకుడు గత చిత్రంలా అదే స్థాయి వున్న కథ-కథనాలతో రూపొందింది. దర్శకులు సుసీంధరన్ అద్భుతమైన కథను రెడీ చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ ని కబాలి చిత్రానికి పనిచేసిన అంబు, అరియు లు చేస్తున్నారు. ఈ చిత్రంలో మా హీరో సందీప్ కిషన్ ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపించనున్నారు. సందీప్ తప్పకుండా కొత్త కేరక్టరైజేషన్ తో అందరిని ఆకట్టుకుంటాడు. మెహరిన్ పాత్ర చాలా అందంగా వుంటుంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. జులై లో చిత్రాన్ని విడుదలకి సన్నాహలు చేస్తున్నాము. తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన డి.ఇమ్మాన్ గారిని తెలుగు తెరకు పరిచయం చేశాము. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.” అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, ఛాయాగ్రహణం: జె.లక్ష్మణ్ కుమార్, ఎడిటర్: ఎం.యు.కాశీవిశ్వనాధం, పాటలు: రామజోగయ్య శాస్త్రి-శ్రీమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.సి, సహ-నిర్మాత: రాజేష్ దండా, సమర్పణ: శంకర్ చిగురుపాటి, నిర్మాత: చక్రి చిగురుపాటి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుసీంధరన్!