సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ట్రైలర్‌తో ఆకట్టుకుంది.
సినిమాలో హీరో పాత్రకు సినిమా హీరోయిన్లంటే కాస్తంత చిన్న చూపు ఉంటుంది. టీజర్లో కూడ అదే విషయాన్ని హైలెట్ చేశారు మోహన్ కృష్ణ . ఈ నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్ లాంటి అంశాలని సినిమాలో ప్రస్తావించారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సినిమా కథపై క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి కాంట్రావర్సీలు ఏవీ సినిమాలో ఉండవని, కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకుంటూ చూసే సినిమా అని క్లారిటీ ఇచ్చారు.
అసలేముందిలా ఈ స్టార్లల్లో. నటన అబద్ధం, గ్లామర్ అబద్ధం, మాటలు అబద్ధం. అయినా ఎగబడతారేంట్రా? అంటూ సుధీర్‌బాబు చెప్పే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌లో సినిమాలోనే మరో సినిమా ప్రపంచాన్ని చూపించారు. స్టార్ట్ కెమెరా..రోలింగ్..యాక్షన్ అంటూ దర్శకుడు హరీశ్ శంకర్ అతిథి పాత్రలో కనిపించగా స్టార్లు మామూలు మనుషులు కారు. వాళ్లను చూడ్డానికి మనం డబ్బులిచ్చి థియేటర్‌కు వెళుతున్నామంటే మనలో లేనిది వారిలో ఏదో ఉంది చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.సినిమావాళ్ల మీద నాకున్న అభిప్రాయం తప్పనుకున్నా నిన్ను కలిసిన తర్వాత. కాదని చెంప పగలగొట్టి మరీ నిరూపించావ్. మనుషుల్ని వాడుకోవడం మీ ప్రొఫెషన్‌లో చాలా సాధారణం అనుకుంటా అని సుధీర్ చెప్పే డైలాగ్‌తో ముగిసింది ట్రైలర్.