మేడారం జాతర.. భారీగా తరలివస్తున్న భక్తులు

173

మేడారం సమ్మక్క-సారక్క దేవతలను దర్శించుకునేందుకు  భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వరాల తల్లులను దర్శించుకునేందుకు  అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారు.   శివసత్తుల పూనకాలతో, సకుటుంబ సపరివార సమేతంగా తల్లులను దర్శించుకున్న భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు.

అమ్మవార్ల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం తల్లులకు యాటపోతులను, కోళ్లను సమర్పించి గద్దెల పరిసరాల్లో వంటలు చేసుకొని విందు భోజనాలు చేస్తున్నారు.

 Medaram Jatara

సమ్మక్క సారక్క జాతర వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగ గా గుర్తింపు పొందింది. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా.

వరంగల్లు నుండి 110 కిలోమీటర్ల దూరములో తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, తెలంగాణలోనే కాక అఖిల భారత దేశములోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. “దేశములోనే అతి పెద్ద గిరిజన జాతర”గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది.