టాలీవుడ్ జంట నాగచైతన్య- సమంత విడిపోవడం సంచలనంగా మారిన విషయం తెలిసింది. అయితే ఎప్పుడైతే ఈ జంట విడిపోతున్నట్టు ప్రకటించారో అప్పటినుండి కొందరు సమంతపై విమర్శలు చేస్తున్నారు. తనపై వస్తున్న కథనాలు, జరుగుతున్న ప్రచారాలను సమంత తాజాగా తీవ్రస్థాయిలో ఖండించింది. తనకు అఫైర్లు ఉన్నాయని, సంతానం వద్దనుకున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని సామ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విట్టర్లో ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.
“నేనొక అవకాశవాదినంటున్నారు. ఇప్పుడు అబార్షన్లు కూడా చేయించుకున్నానట. విడాకులు అనేది ఎంతో బాధాకరమైన అంశం. కాలమే దీన్ని నయం చేస్తుంది. అందుకే నా మానాన నన్ను వదిలేయండి. గత కొన్నిరోజులుగా నాపై జరుగుతున్న ఈ వ్యక్తిగత విమర్శల దాడులు చూస్తుంటే ఏమాత్రం కనికరం లేకుండా ఉన్నారనిపిస్తోంది. కానీ ఇలాంటి విమర్శలతో నన్ను కుంగదీయాలనుకుంటే ఎప్పటికీ తలవంచేది లేదు. ఈ వ్యక్తిగత సంక్షోభ సమయంలో అభిమానులు నాపై చూపుతున్న భావోద్వేగభరిత స్పందనలు నన్ను ముంచెత్తుతున్నాయి. హృదయపూర్వకంగా సహానుభూతి ప్రదర్శిస్తూ, నాపై వస్తున్న పుకార్లను, తప్పుడు కథనాలను ఖండిస్తూ నాకు మద్దతిస్తున్న అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అంటూ సామ్ పేర్కొంది.