మనుషులంతా సమానత్వమే అనే నినాదం కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు… తన జీవితాన్నే ధారపోసిన భారతీయ సామాజిక తత్వవేత్త మహాత్మాజ్యోతిరావుపూలే అని సీఎం కేసీఆర్ అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి సందర్భంగా ఈ దేశానికి ఫూలే చేసిన సేవలు, త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ దేశంలో వర్ణలింగ వివక్షకు వ్యతిరేకంగా దళిత గిరిజన బహుజన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జ్యోతిబాఫూలే దాదాపు రెండు వందల ఏండ్ల క్రితమే కార్యచరణ చేపట్టారని అన్నారు. దేశంలో గుణాత్మక మార్పు దిశగా దేశంలోని స్త్రీలు, దళిత బహుజనులు ఉద్యమించేలా ఫూలే కార్యాచరణ పురికొల్పిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మహాత్మా ఫూలేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా తన గురువుగా ప్రకటించుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నేడు తెలంగాణలోని దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు, మహిళలు.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధించి సామాజిక సమానత్వ దిశగా పురోగమించాయని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఎక్కువ శాతం బహుజన వర్గాలు లబ్ధిదారులుగా వున్నారని సీఎం తెలిపారు. అందరితో పాటుగా దళితబంధు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక ప్రగతినిధి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి, పారిశ్రామికవేత్తలకు అండగా టీఎస్ ప్రైడ్, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గిరిజనులకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు వంటి అనేక కార్యక్రమాలను, ఎస్సీ ఎస్టీల ప్రగతి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.
అలాగే బీసీల వికాసానికి మహాత్యాజ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి, బీసీ గురుకులాలు, గొర్రెల పంపిణీ, బెస్త, ముదిరాజుల ఉపాధి కోసం చెరువుల్లో చేపల పెంపకం, బీసీలకు ఆత్మగౌరవ భవనాలు, గీత, చేనేత, మత్స్యకార్మికులకు ప్రమాద బీమా, కల్లు దుకాణాల పునరుద్ధరణ, గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు, నేతన్నకు చేయూత, సెలూన్లకు ఉచిత్ విద్యుత్ ద్వారా నాయీ బ్రాహ్మణులకు చేయూత, రజకులకు ఆధునిక లాండ్రీ యంత్రాలు, దోభీ ఘాట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను సంబ్బండ వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.
అణగారిన వర్గాలు, బహుజనుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అయిన సామాజిక, ఆర్థిక ఆత్మగౌరవాలను ద్విగుణీకృతం చేస్తున్నామని సీఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ కృషి వెనుక మహాత్మా ఫూలే ఆదర్శాలు, ఆశయ సాధన లక్ష్యాలు ఇమిడి ఉన్నాయని సీఎం అన్నారు. ఫూలే ఆశయ సాధన దిశగా మహిళలకు గురుకుల విద్యతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. జ్యోతిబా ఫూలే అందించిన స్ఫూర్తితో వికాసమే వివక్షకు విరుగుడు అనే విధానాన్ని అనుసరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి…
KTR:చరిత్రలో నిలిచే పథకాలు..కేటీఆర్
పెండింగ్ బిల్లులపై సుప్రీంలో విచారణ
AP:ఏపీలో బిఆర్‌ఎస్ టార్గెట్ 175.. ఆ పార్టీలకు ముప్పే