వ్యాపార, పారిశ్రామిక, వ్యాణిజ్య సంస్ధలో పనిచేసే ఉద్యోగులకు,కార్మికులకు వేతనాలను చెక్కుల ద్వారా లేదా ఆన్‌లైన్‌లో విధానంలో చెల్లించడానికి వీలుగా వేతనాల చెల్లింపు చట్ట సవరణకి ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్రమంత్రి వర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవలే ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వేతనాల చెల్లింపు చట్టం,1936లో సవరణలను ఉద్దేశించి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. పెద్దనోట్ట రద్దుపై పార్లమెంటు సమావేశాలు స్తంభించిపోయిన నేపథ్యంలో బిల్లు ఆమోద ముద్ర పొండలేదు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. జీతాలను రూపాయలు,నాణేల రూపంలో చెల్లించాలని నిర్దేశిస్తున్న వేతనాల చెల్లింపు చట్టం 1936 నాటిది.
అయితే, ఉద్యోగి అనుమతి తీసుకున్న తర్వాత వేతనాన్ని చెక్కుద్వారా చెల్లించటంగానీ, బ్యాంకుఖాతాలో జమచేయటానికిగానీ అవకాశం కల్పిస్తూ ఈ చట్టంలో 1975లో ఒక నిబంధనను చేర్చారు. ప్రస్తుతం ఈ చట్టం రూ.18 వేలకన్నా తక్కువ వేత నం ఉన్న ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తున్నది. అయితే ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, హర్యానా రాష్ట్రలో ఈ చట్టానికి రాష్ట్రస్థాయిలో మార్పులు చేసి, కార్మికులకు కూడా నగదు రహిత విధానంలో వేతనాల చెల్లింపునకు అనుగుణంగా ఇప్పటికే ముందడుగు వేశాయి.
తాజాగా కేంద్రం కూడా ఈ నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల రైల్వే, విమాన రవాణా సేవలు, గనులు, చమురుబావులు తదితర రంగాల్లోని కార్మికులకు నగదురహిత విధానంలో వేతనాలను చెల్లించటానికి వీలవుతుంది. అంతేగాక అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు వివిధ చట్టబద్ధమైన హక్కులను పొందటానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.
ఎలాగంటే.. ప్రస్తుతం పలువురు యజమానులు తమ వద్ద ఉన్న ఉద్యోగుల సంఖ్యను తక్కువగా చూపించటం, వారికి పూర్తిస్థాయి ఈపీఎఫ్‌ను చెల్లించకపోవటం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. చట్ట సవరణ వల్ల ఇటువంటి వాటికి అడ్డుకట్ట పడుతుంది. అయితే, ఆర్డినెన్స్ తర్వాత కూడా… నగదురహిత పద్ధతితోపాటు నగదు రూపాణ కార్మికుల వేతనాలను చెల్లించటానికి యజమానులకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వేతనాల సవరణ చట్టం బిల్లును ఆరు నెలల్లోగా పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. లేదంటే ప్రస్తుత ఆర్డినెన్స్ రద్దవుతుంది. మరోవైపు, సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన డెవలప్‌మెంట్ కమిషనర్ కార్యాలయంలో ఇండియన్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ సర్వీస్ (ఐఈడీఎస్) ఏర్పాటుకు, క్యాడర్ సమీక్షకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేకిన్ ఇండియా లక్ష్యాలను సాధించటానికి మార్గం సుగమమవుతుందని అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
కేంద్రప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకొస్తున్న నేపథ్యంలో… దీనికి అనుగుణంగా రాష్ట్రప్రభుత్వాలు కూడా ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసి సంబంధిత పరిశ్రమలు, వాణిజ్యసంస్థలకు ఆదేశాలివ్వాల్సి ఉంటుందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తత్రేయ మీడియా సమావేశంలో వెల్లడించారు. కార్మికుల అనుమతి తీసుకున్న తర్వాతే చెక్కుల రూపంలోగానీ, బ్యాంకుఖాతాల్లో జమచేయటం ద్వారా గానీ యాజమాన్యాలు వేతనాలను చెల్లించాల్సి ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.