ఆషాడ పౌర్ణమి పురస్కరించుకొని నేడు శ్రీశైల భ్రమరాంబ దేవి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉత్సవం కోసం సుమారు 40 రకాల పైగా ఆకుకూరలు కూరగాయలను వివిధ రకాల ఫలాలను ఉపయోగించి 3500 కేజీలకు పైగా ఆకుకూరలు కూరగాయలు ఫలాలతో ఈ ఉత్సవంలో వినియోగించారు.
దేవస్థానం సూచనల మేరకు దాతలు వీటిని విరాళంగా సమర్పించారు ముఖ్యంగా వంగ బెండ కాకర చిక్కుడు గోరు చిక్కుడు మునగ సొర బీర గుమ్మడి బంగాళదుంప కందదుంప క్యాప్సికం క్యాబేజీ బీన్స్ క్యారెట్ అరటి, బెంగుళూరు మిరప మొదలైన రకాల కూరగాయలు తోటకూర పాలకూర మెంతికూర మొదలైన ఆకుకూరలు పుదీనా కరివేపాకు కొత్తిమీర లాంటి సుగంధ పత్రాలు కమల బత్తాయి ద్రాక్ష యాపిల్ అరటి పైనాపిల్ మొదలైన పలు రకాల ఫలాలు నిమ్మకాయలు బాదం కాయలు మొదలైన వాటిని ఈ ఉత్సవానికి చెప్పించారు.
శ్రీ భ్రమరాంబ అమ్మవారి ఉత్సవ మూర్తికి విశేష పూజలు అలాగే ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి దేవి వారికి సప్తమాతృకలు గ్రామదేవత అంకాలమ్మ కు ప్రత్యేక పూజలు చేసి విశేషంగా శాఖా అలంకరణ నిర్వహించారు. అమ్మవారికి శాఖలతో అర్చించడం వలన అతివృష్టి అనావృష్టి నివారించబడి సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని కరువు కాటకాలు నివారించబడతాయని పురాణాలు చెప్పడంతో ఈ శాకంబరి ఉత్సవాలు అమ్మవారికి చేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ ఉత్సవాన్ని భౌతిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారికి అర్చకులు పూజలు నిర్వహించారు.