కరోనా విలయం కారణంగా మధ్య తరగతి ప్రజల జీవితాలు కుదేలైన విషయం తెలిసిందే..ముఖ్యంగా రంగస్థల కళాకారుల జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ప్రదర్శనలు లేక వేలాదిమంది కళాకారులు ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ నేపధ్యంలో.. ప్రముఖ సినీరచయిత సాయిమాధవ్ బుర్రా తన స్వస్థలమైన తెనాలిలో ఆదివారం. దాదాపు 300మంది పేద కళాకారులకు ఒక నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను అందించి తన పెద్దమనసును చాటుకున్నారు.
తనను ఇంతవాడిని చేసిన రంగస్థలం ఋణం కొంతైనా తీర్చుకోవాలనే సత్ సంకల్పంతో ఆయన కొన్ని నెలల క్రితం తెనాలిలో ‘కళలకాణాచి’ అనే సంస్థను స్థాపించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు పేదకళాకారులను ఆదుకోవడమే ఈ సంస్థ లక్ష్యం. కరోనా విలయం నేపథ్యంలో ఈ సంస్థ ద్వారానే సాయి మాధవ్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు.
దాదాపు మూడు లక్షల పైచిలుకే ఈ కార్యక్రమానికి ఖర్చు చేయడం జరిగిందనీ, పేద కళాకారుల ఆకలి తీర్చడంకోసం ఖర్చుకు వెనుకాడకుండా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన సాయిమాధవ్‌కి తెనాలి కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని ‘కళలకాణాచి’ సంస్థ కార్యదర్శి షేక్ జానీబాషా పేర్కొన్నారు. వందలాదిగా కళాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, కోశాధికారి ఆరాధ్యుల నాగరాజు, ఇంకా సంస్థ సభ్యులు గోపరాజు విజయ్, వేమూరి విజయభాస్కర్, చార్లీ, భవాని, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.