5వ విడత గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రారంభించిన సద్గురు జగ్గీ వాసుదేవ్..

64
sadguru
- Advertisement -

తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలని చెప్పారు సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్. తన ప్రపంచ పర్యటనలో భాగంగా తెలంగాణాలోకి ప్రవేశించగానే భారీ పచ్చదనం ఆకర్షించిందని అన్నారు.

వ్యవసాయంలో రసాయనాల వాడకంతో నేల తల్లి జీవం కోల్పోతోందని, రానున్న తరాలకు ఇది పెనుముప్పు కాబోతోంది అన్నారు సద్గరు జగ్గీ వాసదేవ్. పుడమికి, మట్టికి ప్రత్నామ్నాయం లేదని.. వీలైనంతగా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు.

సేవ్ సాయిల్ (మట్టిని రక్షించు) ఉద్యమాన్ని చేపట్టి ప్రపంచ యాత్ర చేస్తున్న సద్గురు హైదరాబాద్ మీదుగా బెంగుళూరు పయనం అయ్యారు. మార్గ మధ్యలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడతను శంషాబాద్ సమీపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో సద్గురు స్వయంగా మొక్కలను నాటి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, దండే విఠల్ పాల్గొని మొక్కలు నాటారు.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణకు హరితహారం ప్రగతి నివేదికను సమావేశంలో వివరించారు. ప్రభుత్వం సాధించిన పచ్చదనం పెంపు విజయాలను సద్గురుకు వివరించారు.

ఎంపీ సంతోష్ చిన్న వయసులో పెద్ద బాధ్యత తీసుకున్నారు : సద్గురు

చిన్న వయసులో పెద్ద కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని సద్గరు ప్రశంసించారు. సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రెండు ఉద్యమాల లక్ష్యం ఒక్కటేనని పుడమిని కాపాడుతూ, ప్రకృతి, పర్యావరణం ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికీ తెలియజెప్పటమే అన్నారు.

పూర్వజన్మ సుకృతం- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం- సద్గురు ఆశీస్సులు : ఎంపీ సంతోష్ కుమార్

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో, దేశమంతా హరిత భావజాలం వ్యాపింపచేయాలని నాలుగేళ్ల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టామని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. ఐదో యేట అడుగు పెట్టిన తమను వెన్నంటి ప్రోత్సహిస్తూ, గ్రీన్ ఇండియా తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.ఇంతటి ఆదరాభిమానాలు, సద్గురు ఆశీస్సులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలు తీసుకుంటామని అన్నారు.

గొల్లూరు ప్రాంతంలో క్షీణించిన అటవీ ప్రాంతంలో భారీగా చెట్లను పెంచి, చిక్కని పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ ను అటవీ శాఖ సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టింది. మొదటి దశలో ఇప్పటికే సుమారు తొమ్మిది వందల ఎకరాల అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అటవీ పునరుద్దరణ పనుల్లో భాగంగా, ఐదవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒకేసారి పదివేల పెద్ద మొక్కలను నాటారు. సద్గురుతో పాటు, ఆయన అభిమానులు, ఈషా ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, OSD ప్రియాంక వర్ఘీస్, ప్రభుత్వ సలహాదారు ఆర్. శోభ, పీసీసీఎఫ్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్.ఎం. డోబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి డీఎఫ్ఓ జానకిరామ్, ఎఫ్ఆర్వో విష్ణు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కరుణాకర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -