తన క్రికెట్ కెరీర్‌లో ఎదురైన ఎత్తుపల్లాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్. 1994లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఓ సంఘటనను వీడియో రూపంలో వెల్లడించిన సచిన్ ఓపెనర్‌గా తనకు ఒక అవకాశం ఇవ్వాలని టీమ్‌ను వేడుకున్నట్లు చెప్పారు.
ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసేందుకు ఓ దశలో ప్రాధేయపడాల్సి వచ్చిందన్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చి ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవాలన్న ఆకాంక్ష ఉండేది, దాని కోసం తనకు ఒక అవకాశం ఇవ్వాలని టీమ్‌ను వేడుకున్నట్లు సచిన్ చెప్పారు. ఒకవేళ విఫలమైతే, మళ్లీ మిమ్మల్ని అడగనంటూ మేనేజ్‌మెంట్‌కు తెలిపానన్నారు.
ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్ ఓపెనర్‌గా బ్యాటింగ్ చేపట్టాడు. ఆ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ 82 రన్స్ చేశారు. ఆ రోజుల్లో ఓపెనర్లు కేవలం వికెట్లను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఉండేవారు. కానీ తాను ఓపెనర్‌గా కొంత దూకుడు ఆటను ప్రదర్శించినట్లు సచిన్ వెల్లడించారు. కివీస్‌తో మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లో 82 రన్స్ చేశా, ఇక ఆ తర్వాత మళ్లీ ఓపెనింగ్ చేస్తానని నేనెప్పుడూ అడగలేదు, మేనేజ్‌మెంట్ నన్నే ఓపెనింగ్ చేయాలని కోరిందని సచిన్ చెప్పారు.