టీఆర్ఎస్‌లోకి సబితా, కార్తీక్ రెడ్డి

281
sabitha karthik reddy
- Advertisement -

ఎట్టకేలకు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అనేక తర్జనభర్జనలు,ట్విస్ట్‌లు అనంతరం టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.  ఇవాళ  కుమారుడు కార్తీక్‌తో కలిసి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.

కొన్నిరోజులుగా సబితా కాంగ్రెస్ ను వీడుతారని ప్రచారం జరుగుతోంది. మంత్రి కేటీఆర్,కవితతో భేటీ కావడంతో ఆమె టీఆర్ఎస్లో చేరడం లాంఛనమే అనుకున్నారు. అయితే హైకమాండ్‌ ఆదేశాలతో రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించడంతో కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని ఇవాళ ఉదయం వార్తలు వినిపించాయి. కానీ.. కార్తీక్‌కు చేవెళ్ల టికెట్‌ కేటాయించే అంశంపై స్పష్టమైన హామీరాకపోవడంతో గులాబీ గూటికి చేరాలని సబిత నిర్ణయించుకున్నారు. కేసీఆర్‌ సమక్షంలో రేపు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

వైఎస్ హయాంలో చెవేళ్ల చెల్లెమ్మగా వెలుగు వెలిగింది సబిత. వైఎస్ మరణం తర్వాత రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన సబితా 2014 జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కార్తీక్‌ కోసం తన సీటును త్యాగం చేసింది. ఒక కుటుంబం నుండి ఒక్కరే పోటీచేయాలనే నిబంధనతో మహేశ్వరం సీటును వదులుకుని కార్తీక్‌ రెడ్డిని చేవెళ్ల ఎంపీగా బరిలోకి దింపింది. అయితే కార్తీక్‌కు ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు.

ఇక 2018 ఎన్నికల్లోనే ఇదే పరిస్థితి నెలకొంది. రాజేంద్రనగర్‌ నుండి బరిలోకి దిగాలనుకున్న కార్తీక్‌ చాలాకాలంగా గ్రౌండ్ వ‌ర్క్ కూడా చేసుకున్నారు. అయితే, మ‌ళ్లీ కుటుంబానికి ఒకే టిక్కెట్ నిబంధ‌న‌తో కార్తీక్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదు. ఓ ద‌శ‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి కార్తీక్ మొగ్గు చూపారు. కానీ చేవెళ్ల ఎంపీ టిక్కెట్ ద‌క్కుతుందనే హామీతో వెనక్కితగ్గారు. అయితే తీరా చెవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం కార్తీక్‌కు షాక్‌కు తగిలింది. ఈ నేపథ్యంలోనే సబితా కొడుకు భవిష్యత్‌ కోసం టీఆర్ఎస్‌ ఎక్కేందుకు మొగ్గుచూపారు.

- Advertisement -