వరంగల్ రూరల్ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శాయంపేట మండలం పెద్ద కోడెపాకలో నూతన గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదికను ప్రారంభించారు రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు. మంత్రులకు పెద్ద కో డే పాక గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామానికి కిలో మీటర్ దూరం నుంచే, ఎడ్ల బండిపై ఊరేగుతూ, నడుపుతూ, వచ్చారు మంత్రులు, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలు. డప్పు వాయిద్యాలు, నృత్యాలు, మహిళలు పూలు చల్లుతూ మంత్రులను స్వాగతించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రులు మాట్లాడారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తక్షణమే భూసార పరీక్ష కేంద్రాన్ని మంజూరు చేయిస్తా. స్థానిక మార్కెట్ యార్డు, గోదాములను మంజూరు చేయిస్తామన్నారు. రాష్ట్రంలో మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో 40వేల మెట్రిక్ టన్నుల గోదాములు అదనంగా వస్తాయి. అయినా, పెద్ద కోడే పాక గ్రామానికి 10వేల మెట్రిక్ టన్నుల గోదాం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆయకట్టు రోడ్లు స్థానికంగా నిర్మించుకోవచ్చు.అని మంత్రి తెలిపారు.
కేంద్ర చట్టాలపై విస్తృతంగా చర్చ జరుగుతూనే ఉంది. రైతుల విశాల ప్రయోజనాలకు విఘాతం కలగొద్దన్నదే మన రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం. ఓపెన్ మార్కెట్ చేసి, ఎక్కడైనా కొనుగోలు చేసే, వెసలుబాటు ఇప్పుడు లేదా? ఇక్కడి రైతులు ఛత్తీస్ గడ్ వంటి సుదూర ప్రాంతాలకు వెళతారా? ఇక్కడి వాళ్లు ఇక్కడే అమ్ముతారు. ఎక్కడి వాళ్ళు ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. మోతాదుకు మించి నిలువ ఉంచుకుంటే, అది చట్ట రీత్యా నేరం. కానీ, ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఎంతైనా నిలువ ఉంచుకోవచ్చు. అలాగే ఎవరైనా ఎవరి భూమిని అయినా లీజుకు తీసుకోవచ్చు. ఇది భూసారాన్ని తీవ్రంగా నష్ట పోయే ప్రమాదం ఉంది. కల్లాల ధాన్యం కల్లాల లోనే అమ్ముకోవడం మన దేశ రైతులకు అలవాటు. అందువల్ల నీ పంటను నీవు వాళ్ళు నిర్ణయించే ధరకు అమ్మాలి. నీకు అవసరమైన సరుకును వాళ్ళు నిర్ణయించిన ధరకు కొనాలి. సంస్కరణలు అనివార్యమైనవి అని ప్రధాని మోడీ అంటున్నారు. లాల్ బహదూర్ శాస్త్రిని కూడా ఉటంకించారు.
కానీ, కనీస మద్దతు ధర ఆలోచన అప్పుడు 1964లోనే ఆయన ఒక కమిటీనీ వేసి, ఓ నివేదిక ఇచ్చారు. 1976లో జగ్జీవన్ రామ్ వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మొదటి సారి మక్కలకు కనీస మద్దతు ధర వచ్చింది. క్రమేణా 29రకాల పంటలను కేంద్రం చేర్చింది. రైతులను కాపాడటానికి ప్రభుత్వం కొంత కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. కానీ, కేంద్ర చట్టాల్లో కనీస మద్దతు ధర ఊసు లేదు. రైతులు ఈ విషయాన్ని గుర్తించాలి. కార్పొరేటర్లు వ్యవసాయ రంగంలోకి వస్తే, రైతులకు దిక్కు లేకుండా పోతున్నది. కనీస మద్దతు ధర లేకపోవడం, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే మిషతో ఎవరైనా కొనుగోలు చేసే పద్ధతి వంటి వాటి కారణంగా కేంద్ర చట్టాలను దేశ వ్యాప్తంగా రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై, రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం అనుమానాలు, భయాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర చట్టాలను రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాల్సి వస్తుంది. కొందరు కావాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
గత 12 ఏళ్లుగా వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం చేశాం. మరి మీరు చేశారా? లేదు. గంభీరంగా మాట్లాడుతున్న వాళ్లకు రైతు సంక్షేమం పట్టదు. ఒకవేళ రైతుల మేలు కోరే చట్టాలు అయితే, నేనే తెలంగాణ రైతుల పెద్ద జీతగాడుగా అందరి పక్షాన అభినందిస్తా. రైతులు అడగకుండానే, రైతు బంధు, రైతు భీమా, కల్యాణలక్ష్మి, 24 గంటల ఉచిత విద్యుత్, పంటల కొనుగోలు వంటివేవీ మానిఫెస్టోలో చెప్పకుండానే సీఎం కేసీఆర్ చేశారు. కానీ బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవసాయ అనుబంధ అంశంగా ఫ్రీ మార్కెట్ వంటి చట్టాలను చేస్తామని చెప్పింది. చివరకు ప్రధాని గుర్తు చేసే వరకు తెలియకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కెసిఆర్ ను అడిగే నైతికత కాంగ్రెస్ వాళ్లకు లేదు. రైతులు అడగనివి చేస్తున్నామని చెప్పిన కేంద్రం, అదే రైతులు వ్యతిరేకిస్తున్నవి ఎందుకు చేస్తున్నారు? ప్రజలు రేపు మీ వద్దకు వచ్చే కొత్త బిచ్చగాళ్లను ప్రశ్నించాలి అని మంత్రి కోరారు.
తెలంగాణ భూమి పంటల మాగాణిగా మారింది. ప్రపంచ మార్కెట్‌లో మంచి రకం మన తెలంగాణలో పండుతున్నది. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేయాలి. వరి వల్ల భూమి సారం కోల్పోతుంది. రాబోయే కాలంలో 20లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈసారి 8లక్షల 15 వేల ఎకరాల్లో సాగు జరపనున్నం. ప్రభుత్వం సబ్సిడీ కూడా కల్పిస్తున్నది. వరి కంటే చాలా తక్కువ, మక్కల కంటే కాస్త నీరు ఎక్కువ అవసరం. 5వ ఏట నుంచి పంట చేతికి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా, కొనుగోలు గ్యారంటీ ఉన్న పంట ఇది. రైతులు ఖమ్మం, కొత్త గూడెం జిల్లాల్లో చూసి రండి. రాష్ట్రంలో 25జిల్లాలను ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమని కేంద్ర శాస్ర్తవేత్తలు తేల్చారు. 20లక్షల ఎకరాల్లో ఆలు గడ్డ పండించడానికి అనువైన నేలలు ఉన్నాయి. విత్తన గడ్డను రాష్ట్రంలో పండించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. తెలంగాణలో పంటల విప్లవం ప్రారంభమైంది. బడ్జెట్ లో కూరగాయల రైతులకు ప్రత్యేక నిధులు, సబ్సిడీ మీద అందే విధంగా చేయనున్నాం. రైతులు మార్కెట్ ఉన్న పంటల మీద దృష్టి పెట్టాలి. కర్షక రాజ్యం ప్రభుత్వ ధ్యేయం. ఆ కర్షకులను నడిపించే నేత సీఎం కెసిఆర్ అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.