రైతు బంధు…కేసీఆర్

328
Rythu Bandhu to set for a colourful start
- Advertisement -

దేశ వ్యవసాయ రంగ చరిత్రలో సీఎం కేసీఆర్‌ నూతన అధ్యాయానికి   శ్రీకారం చుట్టబోతున్నారు.వ్యవసాయరంగంలో స్వర్ణయుగానికి బాటలు తీస్తూ.. రైతుబాంధవుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మదిలో మెదిలిన అపూర్వ ఆలోచన ఆచరణరూపం దాల్చే క్షణాలు సమీపిస్తున్నాయి. రైతు బంధు పథకం అమలుకు కరీంనగర్ జిల్లా  చరిత్రాత్మక వేదికగా నిలువబోతున్నది.  తెలంగాణ రైతాంగం కళ్లలో వెలుగును, జీవితాల్లో భరోసాను, కొండంత ధైర్యాన్ని నింపే ఈ పథకం సాయం కోసం రాష్ట్ర రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

రేపు(మే 10న) సీఎం కేసీఆర్ రైతుల జీవితాల్లో వెలుగులు నింపే విప్లవాత్మక పథకం రైతుబంధుకు శ్రీకారం చుట్టనున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండరం ఇందిరానగర్‌లో ఈ బృహత్తర కార్యక్రమానికి వేదిక కానుంది. దాదాపు లక్ష మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొననుండగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదే సమయంలో వివిధ జిల్లాల్లో రాష్ట్రమంతట మంత్రులు ఈ కార్యక్రామన్ని ప్రారంభించనున్నారు. వారం రోజుల పాటు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగనుంది.

వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏ గ్రామంలో ఏ రోజు కార్యక్రమం ఉంటుందో ఇప్పటికే వివరాలను తెలిపారు. కోటీ 40 లక్షల 98 వేల 486 ఎకరాలు..ఎకరానికి రూ.4వేల చొప్పున రూ.5608 కోట్లు..మొత్తంగా 58.06 లక్షల చెక్కులు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైంది.

CM KCR

రైతుబంధు పథకం చెక్కులను నేరుగా రైతులకే అందజేయనున్నారు. చెక్కులను కుటుంబసభ్యులు, మధ్యవర్తుల చేతికి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులెవరైనా అనారోగ్యం లేదా నడవలేనిస్థితిలో ఉంటే అధికారులు వారి ఇంటివద్దకే వెళ్లి అందజేస్తారు. పాస్‌పుస్తకం రాని రైతులు ఆధార్‌కార్డు జిరాక్స్ ఇస్తే రైతుబంధు చెక్కుఇవ్వాలని అధికారులకు స్పష్టంచేసింది.

మొదటిదశ లో రూ.1,602 కోట్లు, రెండోదశలో రూ.2,455 కోట్లు బ్యాంకులకు అందజేసింది. మిగతా మొత్తాన్ని కూడా మే 10 నాటికి బ్యాంకుల్లో జమచేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని 10,823 గ్రామాలకుగాను 160 గ్రామాల్లో అసలు సాగుభూమి లేదని వ్యవసాయ, రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10,663 గ్రామాల్లో పండుగ వాతావరణం మధ్య వారంరోజులపాటు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగనున్నది.

రెండో దశలో యాసంగిలోనూ రైతులందరికీ పెట్టుబడి సొమ్ము అందజేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. వానకాలంలో రైతుబంధు పథకం కింద ఎంతమందికి పెట్టుబడి సొమ్ము ఇస్తారో వారందరికీ యాసంగిలో కూడా అందజేయనున్నట్టు వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

రైతు బంధు పథకం…..సూచనలు

()గ్రామ పహాణీ ప్రతి తప్పనిసరిగా వెంట ఉంచు కోవాలి.
()రైతులకు ముందుగానే పాస్‌పుస్తకాలు, చెక్కులకు సంబంధించిన స్లిప్‌లు పంపిణీ చేశారు..ఒకవేళ స్లిప్‌లను అందించలేకపోతే ఏ కారణంతో ఇవ్వలేకపోయారో లిస్ట్‌ను తయారుచేసి, అందుబాటులో ఉంచుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు
()గ్రామంలో పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ చేసే స్థలంలో 300 కంటే ఎక్కువమంది రైతులు వస్తే అదనపు కౌంటర్లు ఏర్పాటుచేయనున్నారు. కౌంటర్ వివరాలు కేటాయించిన గదిపై అతికిస్తారు.
()రైతులకు ఇబ్బంది కలుగకుండా షామియానాలు, కుర్చీలు వేయించారు. తాగునీటి సౌకర్యం కల్పించారు
()పాస్ పుస్తకం, చెక్కు రెండిండిటినీ ఒక కవర్‌లో పెట్టి రైతుకు అందించనున్నారు.
()పుస్తకం లేకుండా చెక్కులు మాత్రమే వచ్చిన వాటిని తహసీల్దార్ నిర్ధారించిన తరువాత రైతులకు పంపిణీ చేయనున్నారు.
()ప్రతి టీమ్‌కు ఒక గ్రీవెన్స్ అధికారిని నియమించారు. సదరు అధికారి గ్రీవెన్స్ రిజిస్టర్ రెవెన్యూ గ్రామాలవారీగా వచ్చిన విజ్ఞప్తులను నమోదు చేస్తారు.
()పట్టాదార్ పాస్‌పుస్తకం రసీదు రిజిస్టర్‌లో తప్పనిసరిగా రైతు సంతకం తీసుకునేవిధంగా ఏర్పాట్లు చేశారు
()రైతులకు పాస్‌పుస్తకం/ చెక్కుల పంపిణీ సమయంలో టీమ్ లీడర్ ఫైనల్ 1(బీ), అనెక్జర్-2 (నాలా వివరాలు 54 కాలం రిపోర్ట్), అనెక్జర్-3 (కన్సాలిడేటెడ్ ప్రొసీడింగ్స్), పార్ట్ బీ క్యాటగిరీ భూముల వివరాలు, జనవరి 1వ తేదీ తరువాత దరఖాస్తులు వచ్చిన విరాసత్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ (అమెండ్‌మెంట్ రిజిస్టర్) వివరాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోనున్నారు.
()టీమ్ లీడర్ ప్రతిరోజూ పంపిణీచేసిన వివరాలు, ఇంకా చేయాల్సిన వాటి వివరాలను మొబైల్ యాప్ ద్వారా రిపోర్ట్ పంపించనున్నారు.
()రైతులకు పాస్ పుస్తకం పంపిణీ చేసేముందు రైతు సంతకం కానీ/ బొటనవేలిముద్ర కానీ పాస్‌పుస్తకంపై తప్పనిసరి

- Advertisement -