ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయినా రష్యా వెనక్కి తగ్గడం లేదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగో రోజు కూడా యుద్ధం కొనసాగుతోంది. వాసిల్కివ్ లోని ఓ చమురు డిపోపై రష్యా క్షిపణులతో దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో గాలి విషపూరితంగా మారే ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే, ఈశాన్య నగరం ఓఖ్టిర్కాలోనూ రష్యా దాడులు జరపడంతో ఓ ఏడేళ్ల బాలిక సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి గవర్నర్ ప్రకటించారు.
ఇక కీవ్‌లో బాంబుల మోత వినపడుతూనే ఉంది. క్షిపణులతోనూ రష్యా దాడులు జరుపుతోంది. కీవ్ లోని అపార్ట్‌మెంట్ వద్ద కూడా బాంబులతో రష్యా దాడులు జరుపుతుండడంతో అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కీవ్‌ను అధీనంలో తెచ్చుకుంటే రష్యా లక్ష్యం పూర్తయినట్లుగానే భావించాలి. రష్యా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఉక్రెయిన్‌పై చర్యలు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నేతృత్వంలో ఆ దేశ సైన్యం ఏ మాత్రం భయపడకుండా యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. అయితే, తాము ఆయుధాలను వీడబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. కీవ్‌లో సాధారణ ప్రజలను కూడా యుద్ధానికి సిద్ధం చేశారు.