ప్రతిపక్షమే లేని రష్యా ఎన్నికలు!

3
- Advertisement -

రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన ‘యునైటెడ్ రష్యా’ పార్టీ సునాయాసంగా విజయాన్ని కైవసం చేసుకుంది. దాదాపు 57.5 శాతం ఓట్లతో సత్తా చాటినప్పటికీ ఈ విజయం వెనుక క్రెమ్లిన్ (రష్యా ప్రభుత్వం) గడిచిన 26 ఏళ్లుగా నిర్మించిన రాజకీయ వ్యవస్థలోని తీవ్రమైన లోపాలు, చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పోటీలో బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో పుతిన్ పార్టీ విజయం ముందే ఊహించిందే. కానీ, ఈ గెలుపును ఖాయం చేసుకోవడానికి క్రెమ్లిన్ తీసుకున్న తీవ్ర నిర్ణయాలే ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి.

ఇన్నాళ్లూ రష్యాలో మల్టీ-పార్టీ ప్రజాస్వామ్యం ఉందని ప్రపంచానికి చూపించుకోవడానికి క్రెమ్లిన్ కొన్ని చిన్నాచితకా ప్రతిపక్ష పార్టీలను (యాబ్లోకో వంటివి) నామమాత్రంగా అనుమతించేది. వీరిని రాజకీయ విశ్లేషకులు ‘సిస్టమిక్ అపోజిషన్’ అని పిలిచేవారు. అంటే ప్రభుత్వం వీటిని భరిస్తుంది తప్ప, పుతిన్ అధికారానికి భంగం కలిగించే స్థాయికి ఎదగనివ్వదు.

అయితే ఉక్రెయిన్ యుద్ధం ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంతో క్రెమ్లిన్ సహనం నశించింది. గతంలో వార్ బ్లాగర్లపై నిషేధం విధిస్తూ వచ్చిన ప్రభుత్వం, ఇటీవల చివరికి ‘యాబ్లోకో’ (Yabloko) పార్టీని కూడా బ్యాన్ చేసి, పుతిన్‌ను విమర్శించే అభ్యర్థులెవరూ పోటీ చేయకుండా అడ్డుకుంది. రష్యా పౌరులలో ఆర్థిక వ్యవస్థ, సేవలు మరియు యుద్ధ వ్యయంపై అసంతృప్తి పెరుగుతున్నప్పటికీ పుతిన్ అధికారం తగ్గలేదు సరిపోదా, మరింత బలపడింది.

జామ్‌స్టౌన్ ఫౌండేషన్ రష్యా విశ్లేషకురాలు క్సేనియా కిరిల్లోవా అభిప్రాయం ప్రకారం..ఉక్రెయిన్ యుద్ధం పుతిన్ పాలనకు ప్రధాన పునాదిగా మారింది. యుద్ధం నెపంతో పుతిన్ గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంక్షలు విధించి, ప్రజలలో దేశభక్తిని రగిలించి తన అధికారాన్ని మరింత కాలం పొడిగించుకున్నారు. ఏప్రిల్ నాటికే రష్యా లోటు 5.9 ట్రిలియన్ రూబుళ్లకు చేరింది (ఇది ఏడాది మొత్తానికి అనుకున్న 3.8 ట్రిలియన్ల కంటే చాలా ఎక్కువ). రష్యా ఆర్థిక మంత్రి అంటోన్ సిలుఆనోవ్ బహిరంగంగానే ప్రజా వ్యయాన్ని తగ్గించాలని హెచ్చరించారు.

Also Read:ఎన్టీఆర్ ‘డ్రాగన్’..క్రేజీన్యూస్

ప్రస్తుతం రష్యాలో సాధారణ ప్రజల అసంతృప్తి కంటే, డబ్బు, ఆయుధాలు మరియు సమాచారం ఉన్న రష్యా అగ్ర వర్గాలు (Elites) ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. ఆ వర్గాల్లో ఇప్పుడు “పూర్తి విజయం” గురించి కాకుండా, ఈ యుద్ధాన్ని సురక్షితంగా ఎలా ముగించాలనే దానిపైనే చర్చలు జరుగుతున్నాయి.

- Advertisement -