జూరాల ఆయకట్టు పొలాలకు సాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న రైతులు, ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతుల పక్షాన పోరాడుతున్న మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డితో పాటు ఇతర నాయకులను అక్రమంగా నిర్బందించడం దుర్మార్గం అన్నారు.
కృష్ణా జలాలను శ్రీశైలం నుండి 738 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో పెన్నా బేసిన్లో ఉన్న కుప్పం వరకు తరలిస్తుంటే.. పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం ఎందుకు తరలించడం లేదు?..ఇది కాంగ్రెస్ పాలనా వైఫల్యం కాదా? పాలకుల చేతగానితనం కాదా? అని ప్రశ్నించారు.కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లపూర్ (8.51 tmc), ఏదుల (6.55tmc), కరివెన(17.34tmc), వట్టెం (16.74) మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాలను నిర్మిస్తే.. వాటిని నీళ్లతో నింపే సోయి కూడా మీకు లేదా?..గడిచిన రెండున్నరేళ్ల పాటు కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు పారినా ఎందుకు మోటర్లను నడపలేదు?,శ్రీశైలం నిండుకుండలా ఉన్నా రైతులకు నీళ్లు ఎత్తిపోసే ఆలోచన ఎందుకు చేయలేదు?,కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెట్టి తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఎందుకు గాలికొదిలేశారు? అన్నారు.
ముఖ్యమంత్రి గానీ, నీళ్ల మంత్రిగాని దీనికి సమాధానం చెబుతారా? ..పాలమూరును ప్రాజెక్టును పడావు పెట్టి, రైతుల నోట్లో మట్టి కొట్టారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు రైతులకు చేస్తున్న నమ్మకద్రోహం ఇది.రైతులంటే ఎందుకు అంత నిర్లక్ష్యం రేవంత్ రెడ్డి?..వ్యవసాయం అంటే ఎందుకు ఇంత పట్టింపులేని తనం? ,జూరాల ప్రాజెక్టును పోలీసులు పూర్తిగా దిగ్బంధించి, ఆనకట్ట పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కనిపిస్తే అరెస్టులు చేస్తున్నారు? ఎందుకింత దౌర్జన్యం రేవంత్ రెడ్డి? ,రైతులు నీళ్లు అడుగుతుంటే, వాళ్ల చేతికి సంకెళ్లు వేస్తారా?..కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం వహించింది మీరు.నీళ్లను ఒడిసి పట్టకుండా, విడిచిపెట్టి తెలంగాణకు జల ద్రోహం చేసింది మీరు ..తప్పు మీరు చేస్తే, శిక్ష రైతులు అనుభవించాలా? చెప్పాలా అన్నారు.
Also Read:ఎన్టీఆర్ ‘డ్రాగన్’..క్రేజీన్యూస్
ఎల్ ని నో సాకు చెప్పి పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటారా?..సాకులు చెప్పి తప్పించుకుంటే.. సాగు ముందుకు పోతుందా రేవంత్ రెడ్డి?..పంట పొలాలకు సాగు నీళ్లు ఇవ్వడం చేతగాని ప్రభుత్వం.. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. జూరాలలో 8.4 tmc ల నీరు ఉన్నా కూడా రైతులకు నీళ్లు ఇవ్వడానికి ఎందుకు మనసు రావడం లేదు.పంట పొలాలు ఎండుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతుంటే అది మీకు కనిపించడం లేదా?..జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీళ్లు విడుదల చేయాలని, అదుపులోకి తీసుకున్న మా పార్టీ నాయకులను రైతులను విడుదల చేయాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

