తెలంగాణ కాంగ్రెస్ పార్టీకీ మరో షాక్ తగులనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి పార్టీ మారనున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పట్ల ఆయన గుర్రుగా ఉన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. తాజాగా ఆయన మీడియా మిత్రులతో కలిసి చిట్ చాల్ నిర్వహించారు. టీఆర్ఎస్ లో ఆయన కూడా చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాను ఏ పార్టీలో ఉంటానో తనకే తెలియదన్నారు.
కేసీఆర్ బంధువులు తనను టీఆర్ఎస్ లోకి రమ్మని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఉంటానో, గాంధీభవన్‌లో ఉంటానో మే 25వ తేదీ నుంచి 30లోపు కాలమే నిర్ణయిస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్ లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇటివలే ఆయన సీఎం కేసీఆర్, చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఆయన తప్పకుండా పార్టీ మారుతారనే అనుకుంటున్నారు విశ్లేషకులు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత జగ్గారెడ్డి పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.