ఎన్నికల ఫలితాలకు ముందే ఢిల్లీలో కేసీఆర్ ఫ్రంట్ ఆఫీస్

140
CM KCR

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి చర్చించారు. బీజేపీ, కాంగ్రెస్ కూటములకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకధాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేశ రాజకీయాల్లో పట్టు సాధించాలంటే ఫెడరల్ ఫ్రంట్ కోసం ఢిల్లీలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. వీలైతే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫ్రంట్ కార్యాలయం, స్ధలం, భవనాలపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దేశ రాజధానిలో పార్టీ ఆఫీసును ప్రారంభించనున్నట్లు సమాచారం. ఫెడరల్ ఫ్రంట్ కోసం వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే చాలా పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.

అంతర్గతంగా వీలైనంత మంది నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అంతర్గతంగా పదికి పైగా ప్రాంతీయ పార్టీల పెద్దలతో కేసీఆర్ సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా సీఎం కేసీఆర్ తో టచ్ తో ఉన్నట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ కూడా కేసీఆర్ వెంటే ఉన్నారు. దీంతో తెలంగాణలో 16 సీట్లు, ఏపీలో 20సీట్లతో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మే 23 తర్వాత ఎలాంటి పరిస్ధితులు నెలకొంటాయో చూడాలి.