జ్వరం, డీహైడ్రేషన్ తో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత 11 రోజులుగా చికిత్స పొందుతుండడం.. అమ్మకు సంబంధించిన విషయాలు ఎలాంటివి బయటకు రాకపోవడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం పలువురు కేబినెట్ మంత్రులు, ఐఏఎస్ అధికారులు అపోలో ఆసుపత్రికి చేరుకుని జయలలిత ఆరోగ్యంపై సమీక్షించారు. అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ.. వైద్యులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో జయలలిత ఆరోగ్యంపై హెల్త్‌బులిటెన్ విడుదల చేయాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది.
కాగా, జయలలిత ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఏఐడీఎంకే కొట్టిపారేసింది. జయలలిత కోలుకుంటున్నారని, ప్రభుత్వం ఎప్పటిలాగే పనిచేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి స్పష్టంచేశారు. ఆమె ఆరోగ్యంపై దుష్ప్రచారం చేయొద్దని కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది, మంత్రులు ఆమెను రోజూ కలుస్తూనే ఉన్నారని.. ఆమె ఆరోగ్యాన్ని వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు.
జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇన్‌చార్జ్ గవర్నర్ సీఎచ్ విద్యాసాగర్ రావు శనివారం రాత్రి ఓ ప్రకటన చేశారు. అనారోగ్యంతో ఉన్న సీఎం జయలలిత కోలుకుంటున్నారని ఆయన తెలిపారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను ఆయన పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లిన విద్యాసాగర్‌రావు ఈ ప్రకటన వెలువరించారు. జయలలిత త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆయన ఆక్షాంక్షించారు.